ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీల్లోకి వలసలు పోటెత్తుతున్నాయి. ఈ వలసల్లో వైసీపీ అదినేతకు భారీ ఝలక్ ఇచ్చింది మాత్రం ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన తన మామ బాలినేని శ్రీనివాసరెడ్డే. బంధుత్వాన్ని కూడా పక్కనపెట్టేసిన బాలినేని.. వైసీపీకి రాజీనామా చేసి నేరుగా జనసేనలో చేరిపోయారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకునేందుకు జగన్ కు చాలా సమయమే పట్టి ఉంటుందన్న వాదనలు వినిపించాయి. తాజాగా బాలినేని చేపడుతున్న ఓ కార్యక్రమం వైసీపీ శిబిరాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది.
సీఎం నారా చంద్రబాబునాయుడు అందుబాటులో లేని కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలోనే తిష్ట వేశారు. ఈ క్రమంలో గురువారం మంగళగిరి వెళ్లిన బాలినేని… పవన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఓ కీలక అంశం చర్చకు వచ్చిందట. ఫిబ్రదరి 5న ప్రకాశం జిల్లా పర్యటనకు రావాలని పవన్ ను కోరిన బాలినేని… అదే రోజు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో భారీ బహిరంగ సభను నిర్వహిద్దామని ప్రతిపాదించారట. వాస్తవానికి ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి… తన అనుచరుల మధ్య జనసేనలో చేరాలని బాలినేని భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం తాను గతంలో ఆశించినట్లుగా భారీ బహిరంగ సభను ఒంగోలులో నిర్వహించి తీరాలని బాలినేని పట్టుబడుతున్నారట.
ఇలా బాలినేని పట్టుబడుతున్న వైనం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందన్నవిశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఒంగోలులోనే కాకుండా ప్రకాశం జిల్లావ్యాప్తంగా బాలినేనికి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలినేని వెంట చాలా మంది కీలక వైసీపీ నేతలు జనసనలోకి చేరేందుకు నాడే సిద్ధమయ్యారట. అయితే తన బలాన్నిచాటుకునే సందర్భం కోసం వేచి చూడాలని భావించిన బాలినేని నాడు వారిని అలా ఆపారట. ఇప్పుడు వారంతా ఇంకెప్పుడు తమను జనసేనలోకి తీసుకెళతారంటూ బాలినేనిపై ఒత్తిడి తీసుకువస్తున్నారట. దీంతోనే బాలినేని గురువారం పవన్ తో భేటీ అయ్యారట.
బాలినేని ప్రతిపాదించినట్లుగా ఫిబ్రవరి 5న పవన్ ప్రకాశం జిల్లా టూర్ కు అంగీకరిస్తే.. ఒంగోలులో భారీ బహిరంగ సభ ఖాయమేనని చెప్పాలి. అంతేకాకుండా జనసేనలోకి బారీ ఎత్తున చేరికలు ఉంటాయని కూడా చెప్పాలి. ఈ చేరికల్లో వైసీపీకి చెందిన కీలక నేతలు చాలా మందే జనసేనలోకి చేరనున్నట్లుగా సమాచారం. వీరిలో ఒంగోలు మునిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా ఉన్న వారు చాలా మందే ఉన్నారట. వీరంతా జనసేనలో చేరితే…ఒంగోలు కార్పొరేషన్ చైర్మన్ గిరీ కూడా జనసేన చేతికి చిక్కినట్టేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఒంగోలులో వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోతుందని, ప్రకాశం జిల్లాకు చెందిన వారే కాకుండా…గ్రేటర్ రాయలసీమకు చెందిన పలువురు కీలక నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరిపోయేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.