జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు ఏదో పదవి దక్కడంతోనే సంతృప్తి పడిపోయే రకం కాదు పవన్. తన చేతికి చిక్కిన పదవిని, అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా…తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగాలన్నది ఆయన లక్ష్యం. ఇదే మాటను ఆయన పదే పదే చెబుతూనే ఉంటారు. అలా వేదికల మీద చెప్పడంతోనే ఆగని పవన్… దానిని కార్యరూపంలోనూ చూపిస్తున్నారు. ఫలితాలు రాబడుతున్నారు కూడా.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్… గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలతో పాటుగా అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. గడచిన 7 నెలలుగా తనకు ఇష్టమైన పల్లెలను ప్రగతి బాటన పట్టించేందుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ 7 నెలల వ్యవధిలోనే తనదైన శైలి సత్తా చాటిన పవన్ పల్లెల్లో రికార్డు స్థాయిలో రోడ్లను ఏర్పాటు చేయగలిగారు. గోశాలలను ఏర్పాటు చేయగలిగారు. పల్లె ప్రగతికి సంబంధించి పకడ్బందీ ప్రణాళికలు రచించారు. ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.
తాజాగా పవన్ అటవీ శాఖపై దృష్టి సారించారు. గడచిన 7 నెలల్లో షెడ్యూల్ వారీ రివ్యూలు తప్పించి… అటవీ శాఖపై పవన్ పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు పల్లె ప్రగతిని పట్టాలెక్కించిన పవన్… అటవీ శాఖనూ గాడిలో పెట్టేందుకు రంగంలోకి దిగారు. అందులో బాగంగా గురువారం అటవీ, పర్యావరణ శాఖలపై ఆయన కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ శాఖలకు చెందిన కీలక అధికారులంతా హాజరైన ఈ సమావేశంలో పవన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వీలయినంత త్వరలోనే అటవీ శాఖను పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరిస్తానని… ఈ రెండు శాఖల్లో మంచి పనితీరు చూపించాల్సిన బాధ్యత మీదేనంటూ ఆయన అదికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమీక్షంలో భాగంగా పవన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అటవీ భూముల పరిరక్షణను ప్రదానంగా ప్రస్తావించిన పవన్.. అటవీ భూములను ఆక్రమించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో అన్యాక్రాంతమవుతన్న అటవీ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాలని, ఇతర రాష్ట్రాలు ఎగురవేసుకుపోతున్న ఆదాయానికి కళ్లెం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర అడవుల్లో లభించే అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులను సంరక్షించాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. గిరిజనులకు ఉపాధి కల్పిస్తూనే… అడవుల్లోని కలప ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. తొలి సమీక్షలోనే అటవీ శాఖ ప్రక్షాళన దిశగా పవన్ చేసిన సూచనలు, జారీ చేసిన ఆదేశాలు చూస్తుంటే… సమీప భవిష్యత్తులోనే ఈ రెండు శాఖల్లో పెను మార్పులు ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.