బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బుధవారం ఈ మేరకు బీజేపీ నాయకత్వానికి ముంబైలోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి లేఖ చేరినట్టు మహా రాష్ట్ర రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో బీజేపీకి తీవ్ర ప్రతిబంధకం ఎదురవుతోంది.
ఈ క్రమంలో తాము ఉచిత పథకాలకు వ్యతిరేకమైనప్పటికీ.. ఢిల్లీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికి రెండు మేనిఫెస్టోలు విడుదల చేసిన కమల నాథులు ఢిల్లీ వాసులపై లెక్కకు మిక్కిలిగా వరాల జల్లు కురిపించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆప్‌కు పోటీగా.. ‘కేజీ నుంచి పీజీ వరకూ ప్రభుత్వ సంస్థల్లో ఉచిత విద్య’ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ఢిల్లీ యువతకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఇక, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల స్టైఫండ్ ఇస్తామని భారీ హామీ ఇచ్చారు. ఇక, మహిళలకు నెలనెలా రూ.2500, ఉచిత బస్సు ప్రయాణం కొనసాగింపు, 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు… ఇలా లెక్కకు మిక్కిలిగా బీజేపీ వరాలు కురిపిస్తోంది. అయితే.. దీనిని తప్పుబడుతూ.. ఆర్ ఎస్ ఎస్.. ‘ఇక, చాలు ఆపండి’ అని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ సంధించారని మహారాష్ట్ర రాజకీయ వర్గాల సమాచారం.
“ఉచితాలకు మేం వ్యతిరేకం. కానీ, ఏదైనా పేదలు ఉంటే ఉచితాలు ఇవ్వొచ్చు. పైగా దేశ రాజధానిలో ఉచితాల పేరుతో ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు. ఉచితాల పేరుతో ఓట్లు అడగడం ద్వారా.. మోడీ పాలనను తక్కువ చేసి చూపుతున్నారా? లేక, పదేళ్ల బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ది, దేశ ఉన్నతి కంటే.. ఉచితాలే మంచిదని భావిస్తున్నారా? అనేది ప్రజల్లోకి వెళ్తే.. అది మరింత ప్రమాదకరం. అందుకే మా బాధ్యతగా మేం చెబుతున్నాం. తర్వాత వారి ఇష్టం” అని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.