కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ సమీపంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో చర్చించారు. ఇదేసమయంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులతోనూ మాట్లాడారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. కానీ, ఈ విషయం ఇంకా బీజేపీ నాయకులకు ఒంటబట్టినట్టు లేదన్న చర్చ సాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మంత్రి వర్గంలోకి బీజేపీని కూడా తీసుకున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు వైద్య శాఖ అప్పగించారు. అయితే.. తమకు మరో పదవి కూడా కావాలన్నది స్థానిక బీజేపీ నేతల పట్టు. దీనిపై కేంద్రం స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. అయితే.. తమ అవసరాలు వేరే ఉన్న నేపథ్యంలో కూటమి పార్టీలతో కలిసి పోవాలని బీజేపీ పెద్దలు రాష్ట్ర స్థాయి నేతలకు సూచించారు. వివాదాలకు తావివ్వకుండా ముందుకు సాగాలని కూడా సూచించారు.
దీనికి తొలుత ఓకే చెప్పిన కమల నాథులు.. తర్వాత మాత్రం తమ పంథాలో తామే వ్యవహరిస్తున్నారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనలకు దూరం పాటిస్తున్నారన్న వాదన ఉంది. పైగా.. గతంలో దూకుడుగా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. సర్కారును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై బీజేపీ అగ్రనాయకులకు ఫిర్యాదులు అందాయి. ఇలా అయితే.. ప్రబుత్వానికి ఇబ్బంది అంటూ సమాచారం చేరింది.
ముఖ్యంగా తిరుపతి తొక్కిసలాటపై.. బీజేపీ నాయకులు తొందరపాటు ప్రకటనలు చేయడంతో మరింతగా ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అమిత్‌షా తాజా పర్యటనలో నాయకులకు కొన్ని సూచనలు చేశారు. కలిసి మెలిసి ఉండాలంటూ.. సూచించారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు ఎక్కడా వినిపించుకున్నట్టు లేదు.
తాజాగా కమలం పార్టీకి చెందిన అంబికా కృష్ణ.. సర్కారుపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే.. అది మోడీ చలవేనని.. ఇప్పుడు జరుగుతున్న పనులకు కేంద్రం ఇచ్చే సొమ్ములే ఆధారమని.. వ్యాఖ్యానించారు. మరి ఇలా ఎవరికి వారు.. వ్యాఖ్యలు చేస్తూ పోతే.. షా చెప్పిన ఫార్ములా ఏమైనట్టు? అనేది ప్రశ్న. ఇప్పటికైనా బీజేపీ నేతలు సంస్కరణ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.