టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు మోహన్ బబు. అందులో అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. సినీ రంగంలో మోహన్ బాబు జోరు తగ్గాక ఈ బేనర్‌ను కొనసాగిస్తున్నది ఆయన తనయురాలు లక్ష్మీప్రసన్నే.
కానీ ఆమె ప్రొడ్యూస్ చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కొన్నేళ్లుగా ఆమె ప్రొడక్షన్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నటిగా మాత్రమే కొనసాగుతున్నారు. ఆమె ఓ కీలక పాత్ర పోషించిన ఓ తమిళ చిత్రం తెలుగులో బూకి పేరుతో ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్లో మంచు లక్ష్మి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాతగా తన ప్రయాణం ముగిసిందంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు.
సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ద్వారా తాను బాగానే నష్టాలు చవిచూసినట్లు మంచు లక్ష్మి స్పష్టం చేశారు. తాను ఐదేళ్ల ముందు ప్రొడ్యూస్ చేసిన సినిమా తాలూకు నష్టాలను ఇప్పటికీ కడుతున్నానని ఆమె చెప్పడం గమనార్హం. తాను ఇప్పుడు నటిగా మాత్రమే కొనసాగుతున్నానని, నిర్మాతగా ఇకపై సినిమాలు తీయనని ఆమె తేల్చి చెప్పారు.
నటిగా వచ్చే డబ్బులతో నిర్మాతగా చేసిన అప్పులను కొంతమేర రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ఆమె వ్యాఖ్యానించారు. చివరగా గత ఏడాది దక్ష సినిమాతో పలకరించారు మంచు లక్ష్మి. ఆమె లీడ్ రోల్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషించారు.
చాలా ఏళ్ల పాటు ఆ సినిమా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. చివరికి రిలీజైనా ప్రేక్షకులు పట్టించుకోలేదు. అంతకుముందు ఆమె ప్రొడ్యూస్ చేసిన దొంగాట, ఊ కొడతారా ఉలిక్కి పడతారా లాంటి సినిమాలు కూడా దారుణ ఫలితాన్ని అందించాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates