2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నాటి నుంచి ఎందుకనో గానీ… వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ నేతలను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేసిన జగన్… ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ వ్యూహం బెడిసికొట్టగా… చాలా మంది నేతలు పరాజయం పాలయ్యారు. పార్టీ కూడా ఘోర పరాజయం మూటగట్టుకుంది. జగన్ తన సీఎం పదవిని కోల్పోక తప్పలేదు.
ఇంత జరిగినా కూడా వైసీపీలో ఇంకా మార్పుచేర్పుల గోల ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీకి కీలక జిల్లాగా పరిగణిస్తున్న పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి ఇంచార్జీగా ఉన్న పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తాజాగా స్థాన చలనం జరిగింది. సత్తెనపల్లి ఇంచార్జీ పదవి నుంచి అంబటిని తప్పించేసిన జగన్.. ఆ స్థానంలో కొత్తగా యువ నేత గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని నియమించారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జీ బాధ్యతలను భార్గవ్ రెడ్డికి అప్పగిస్తూ అంబటి కీలక అడుగు వేశారు.
పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీకి నిఖార్సైన కార్యకర్త మాదిరిగా శిరసావహిస్తున్నానని చెప్పిన అంబటి.. బాధ్యతలను భార్గవ్ రెడ్డికి అప్పగిస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా సత్తెనపల్లిని వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నా… తప్పడం లేదన్నారు. అంబటి నుంచి వినిపించిన ఈ మాటలు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేశాయని చెప్పాలి. సత్తెనపల్లిని భార్గవ రెడ్డికి అప్పగించిన అంబటి..తనకు కొత్తగా ఏ పదవి అప్పగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో అంబటికి అసలు సీటు దక్కుతుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
వాస్తవానికి పల్నాడు జిల్లాలో వైసీపీకి ఓ మోస్తరు బలం ఉన్నా.. సత్తెనపల్లి మాత్రం టీడీపీకి కంచుకోట కిందే లెక్క. దివంగత నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిష్ట వేసిన ఈ నియోజకవర్గంలో అంబటి పోరాడి గెలిచారు. కోడెలను ఓడించిన అంబటి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. పార్టీని నియోజకవర్గంలో ఓ రేంజిలో బలోపేతం చేశారు. అయితే కూటమికి అనుకూలంగా వీచిన గాలిలో మొన్నటి ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే అంబటి ఓడిపోగా…మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడి నుంచి గెలిచారు. తాజాగా నాయకత్వ మార్పుతో సత్తెనపల్లిపై పార్టీ ఆశలు వదులుకున్నట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.