ప‌ద‌వి ఉంటుందో.. పోతుందో..

రాజ‌కీయాల్లో దూకుడు ఉండాలి.. అదేస‌మ‌యంలో ఒకింత జాగ్ర‌త్త‌, ఆలోచ‌న కూడా ఉండాలి. ఈ రెండు లేక‌పోతే.. ముంచుకొచ్చే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అంటారు రాజ‌కీయ పండితులు.. ఇదిగో ఇప్పుడు ఇలా ముంచుకొచ్చే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవడం ఎలా అని త‌ల‌ప‌ట్టుకున్నార‌ట‌.. వైసీపీలో కీల‌క నాయ‌కుడు, మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగ నాథ‌రాజు. రైస్ మిల్లింగ్ రంగంలో కొన్ని ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్న‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి చేరారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో ప‌శ్చిమ‌గోదావ‌రిలో ప‌ర్య‌టించిన‌ప్పుడు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం, ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.. వంటి రీజ‌న్ల‌తో ఆచంట టికెట్ ను అప్ప‌టిక‌ప్పుడే ప్ర‌క‌టించేశారు జ‌గ‌న్‌. ఇక‌, ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌ను ఓడించి గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌లో భాగంగా జ‌గ‌న్‌.. రంగ‌నాథ‌రాజుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. రాజు గారికి గృహ‌నిర్మాణ శాఖ‌ను కేటాయించారు జ‌గ‌న్‌. ఇది ఆయ‌న‌లో తీవ్ర అసంతృప్తిని నింపింది. తాను రైస్ మిల్లింగ్ రంగంలో ఉన్నందున త‌న‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను ఇవ్వాల‌నేది ఆయ‌న కోరిక‌. కానీ, జ‌గ‌న్ ఆయ‌న కోరిక‌ను ప‌క్క‌న పెట్టారు.

ఇక‌, అప్ప‌టి నుంచి మంత్రిగా ఉన్నా కూడా.. రాజుగారు అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు సంబంధం లేక‌పోయినా.. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ వ్య‌వ‌హారాల్లో వేలుపెడుతూ వ‌చ్చారు. ప‌రోక్షంగా ఈ శాఖ‌ మంత్రి కొడాలి నానిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అంద‌రూ చేయ‌లేరండీ! అంటూ.. మీడియా ముందే ఆయ‌న వ్యాఖ్య‌లు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. వీటిపై మంత్రి కొడాలి సీరియ‌స్ కావ‌డం.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు స‌జ్జ‌ల జోక్యం చేసుకుని స‌ర్దిచెప్ప‌డం వంటివి ఇంట‌ర్న‌ల్‌గా జ‌రిగిపోయాయి. ఇక‌, ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయిన‌.. పితాని.. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని కొన్నాళ్ల కింద‌టే వార్త‌లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన రంగ‌నాథ‌రాజు.. పితాని వైసీపీలోకి వ‌స్తే..త‌న‌కు ఎక్క‌డ సెగ పెడ‌తాడో అనుకుని.. ఆయ‌న‌ను రానీయ‌కుండా అడ్డు పుల్లలు వేశారు. దీంతో పితాని త‌న‌ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకున్నారు. ఇక‌, న‌ర‌సాపురం పార్ల‌మెంటు ప‌రిధిలో రాజులనుత‌న‌వైపు తిప్పుకునేందుకు రంగ‌నాథ‌రాజు.. చేసిన ప‌నులు కూడా వివాదాస్ప‌ద మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే సొంత పార్టీ నేత‌ల నుంచి ఆయ‌న విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

మ‌రోవైపు రెండున్న‌రేళ్ల‌లో మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తాన‌న్న జ‌గ‌న్‌.. ఇదే ప్రాంతానికి చెందిన క్ష‌త్రియ నేత‌, వైసీపీ నాయ‌కుడికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. దీంతో త‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో జోక్యం చేసుకుని వివాద‌మైన నేప‌థ్యంలో ప‌ద‌వికి గండం పొంచి ఉంద‌ని, మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న ప్రారంభిస్తే.. త‌న ప‌ద‌వికే తొలి గండం ఉంద‌ని తెలిసి.. మంత్రి రంగ‌నాథ‌రాజు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారట‌!! ఈ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న వైసీపీ నేత‌లు.. చేసుకున్న‌వారికి చేసుకున్నంత అని పెద‌వి విరుస్తున్నారు.