డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని కూడా ఆయన పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీలోకి ఓ నకిలీ ఐపీఎస్ ఎంట్రీ, ఇటీవలే మంగళగిరిలోని పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన వైనంపై జనసేన నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో డీజీపీ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్బంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలు పవన్ కల్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది అని డీజీపీ అన్నారు. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన విషయాన్ని కేవలం ఒక ఆర్ఎస్ఐ మాత్రమే చూశారన్నారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని, తాను అయితే 24 గంటల్లోనే విచారణ పూర్తిచేయాలని ఆదేశించానని, అయితే మరింత సమయం కావాలని లోకల్ పోలీసులు అభ్యర్థించారన్నారు. సోమవారం సాయంత్రానికి ఈ విషయంలో ఓ నిర్ధారణకు వస్తామని ఆయన తెలిపారు.
ఇక పవన్ సెక్యూరిటీలో నకిలీ ఐపీఎస్ ఎంట్రీపై స్పందించిన డీజీపీ… పవన్ భద్రతలో ఎలాంటి లోపం జరగలేదని తెలిపారు. విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పవన్ పర్యటించిన సందర్భంగా ఆ టూర్ ముగిసిన తర్వాత అక్కడ నకిలీ ఐపీఎస్ ప్రత్యక్షమయ్యాడన్నారు. అయినా నిర్దేశిత ప్రోగ్రాం ముగిసిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటనను తాము అసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయినా కూడా పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతపై తామంతా సీరియస్ గా ఉన్నామని తెలిపారు.
సోషల్ మీడియాలో నారా లోకేశ్ వర్సెస్ పవన్ కల్యాణ్ అన్నట్టుగా పెద్ద రచ్చ జరుగుతుందన్న విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ఆ విషయం ఇంకా తన దృష్టికి రాలేదని డీజీపీ అన్నారు. దీనిపై వివరాలు అడిగి తెలుసుకుంటానని తెలిపారు. ఇక సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది గతంలో కంటే అధికంగా కోడి పందేలు జరిగాయన్న విషయంపైనా డీజీపీ వెరైటీగా స్పందించారు. ఈ వ్యవహారం హైకోర్టు పరిశీలనలోనిదని ఆయన తెలిపారు. పందేలు ఎక్కువ జరిగాయా?…తక్కువ జరిగాయా? అన్నది కాకుండా… ఎన్ని కేసులు నమోదు అయ్యాయన్న విషయంపై హైకోర్టుకు తాము ఓ నివేదికను ఇవ్వనున్నట్లు డీజీపీ తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates