ఎవరి సత్తా ఎంత?… రైజింగ్ తెలంగాణ వర్సెస్ బ్రాండ్ ఏపీ!

వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు, ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ సదస్సుకు అత్యథిక ప్రాధాన్యమిస్తూ క్రమం తప్పకుండా హాజరవుతూ వస్తున్నాయి. అందులో భాగంగా భారత్ కూడా ఈ సదస్సుకు వెళుతోంది. కేంద్రం తరఫున సీఐఐ హాజరవుతుండగా… దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాలను పంపుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… అటు తెలంగాణతో పాటుగా ఇటు ఏపీ ప్రభుత్వాల తరఫున ఇరు రాష్ట్రాల సీఎంలు ఎనుముల రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడులు స్వయంగా తమ తమ రాష్ట్రాల ప్రతినిధి బ‌ృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్ లో ఉన్న రేవంత్ ఆదివారం రాత్రి అటు నుంచే నేరుగా దావోస్ చేసుకుంటారు. ఇక ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వీడ్కోలు పలికిన తర్వాత చంద్రబాబు విజయవాడ నుంచి తన బృందంతో కలిసి బయలుదేరారు. తొలుత ఢిల్లీ చేరుకునే చంద్రబాబు…అక్కడి నుంచి దావోస్ బయలుదేరతారు.

రేవంత్ రెడ్డి బృందంలో సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమలు, పెట్టుబడుల రంగంలో విశేష అనుభవం కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ సహా పరిశ్రమల శాఖ అదికారులు ఉన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కొనసాగిన రంజన్… తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా హైదరాబాద్ కు ఆయా సంస్థలను రాబట్టడంలోనూ ఆయన ఓ రేంజిలో ఫలితాలు సాధించారు. ఫలితంగా రేవంత్ బృందం ఫుల్ ఎనర్జీతోనే దావోస్ లో అడుగు పెట్టబోతోంది.

ఇక ఏపీ విషయానికి వస్తే… చంద్రబాబే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్. ఉమ్మడి రాష్ట్రానికి పదేళ్ల పాటు, విభజిత ఏపికి ఇప్పటికే ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన అనుభవంతో పాటు తాజాగా…మరో ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగనున్నారు. దావోస్ లాంటి వరల్డ్ లెవెల్ ఈవెంట్లను తెలుగు జనానికి చంద్రబాబే పరిచయం చేశారంటే అతిశయోక్తి కాదేమో. తాను సీఎంగా ఉండగా… ఏ టూర్లకూ వెళ్లకున్నా… దావోస్ టూర్ ను మాత్రం ఆయన మిస్ కాలేదు. పలితంగా తనకున్న అపార అనుభవాన్ని రంగరించి ఏపీకి పెట్టుబడులు సాధిస్తానన్న ధీమాతో చంద్రబాబు బరిలోకి దిగారు. అంతేకాకుండా ఏపీ బృందానికి తానే నేతృత్వం వహిస్తున్నానని కూడా స్వయంగా చంద్రబాబే ప్రకటించారు.

ఇక చంద్రబాబు బృందంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి పాటుగా పరిశ్రమల శాఖకు చెందిన పలువురు అధికారులు ఉన్నారు. ఇటీవలే ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన షరీన్ పరపరకత్ ఈ బృందంలో కీలక భూమిక పోషించనున్నట్లు సమాచారం. మొన్నటిదాకా తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్న షరీన్ ను రెండు రోజుల క్రితం చంద్రబాబు ఏపీకి లాగేశారు. తమిళనాడుకు పెట్టుబడులు పోటెత్తడంలో కీలక భూమిక పోషించిన కారణంగానే… దావోస్ టూర్ ను దృష్టిలో పెట్టుకునే ఆయనను చంద్రబాబు ఏపీకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. బడా కంపెనీలతో మంచి ర్యాపో ఉన్న షరీన్.. తన సత్తా చాటితే మాత్రం ఏపీకి పెట్టుబడుల పండుగేనని చెప్పక తప్పదు.

ఇక తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ పేరిట దావోస్ లో అడుగుపెడుతుంటే… ఏపీ మాత్రం బ్రాండ్ ఏపీ పేరిట బరిలోకి దిగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్దగా పొరపొచ్చాలు ఏమీ లేనప్పటికీ… ఇరు రాష్ట్రాలు కూడా పొరుగు రాష్ట్రం కంటే ఎక్కువగా పెట్టుబడులు సాధించాలన్న ఆరోగ్యకరమైన పోటీతో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు అనుచరుడిగా కొనసాగిన రేవంత్ గతంలో టీడీపీ నేతగానే కొనసాగారు. టీడీపీ టికెట్ తోనే ఆయన ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఏపీ తరఫున చంద్రబాబు, తెలంగాణ తరఫున రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్న వైనం తెలుగు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.