అదే పనిగా మాట్లాడుతున్నారు…

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాలి. ఎంత రాజకీయాల్లో ఉన్నప్పటికీ అదే పనిగా నోటికి పని చెప్పటం అంత బాగోదు. అవసరమైన వేళ.. అవసరమైనంత మేర మాట్లాడితే దానికి ప్రజలు ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. టార్గెట్ కత్తి పట్టుకొని.. అదే పనిగా విమర్శలు.. ఆరోపణలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. స్థాయిని తెలుసుకొని అందుకు తగ్గట్లు మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. ఇటీవల కాలంలో నరసాపురం ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ రాజు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారటం తెలిసిందే.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధినేత మీదా.. నేతల మీద అదేపనిగా విమర్శిస్తున్న వైనం మొదట్లో బాగున్నట్లు అనిపించినా.. ప్రతి రోజు రచ్చబండపేరుతో అరగంట పాటు స్పీచ్ దంచటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఈ తీరు ఏ మాత్రం బాగోలేదంటున్నారు. ఏపీ అధికారపక్షం మీదా.. పాలనా విధానాల మీద తమ పార్టీ అధినేత తీరుపై అదే పనిగా మాట్లాడుతున్న వైనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న ఆయన తీరు ఏ మాత్రం సరికాదని.. చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. ఈ విషయంలో జగన్ మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టైం చూసుకొని చేద్దామన్నట్లుగా తన వద్దకు వచ్చిన వారికి చెప్పి పంపుతున్నారు. ఎంపీ రఘురామ మీద చర్యలు తీసుకోవాలని భావించినా..అందుకు తగ్గట్లుగా మాట్లాడకుండా.. ప్రభుత్వాన్ని విమర్శించకుండా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడని వైనంతో జగన్ ఊరుకుండిపోయినట్లుగా తెలుస్తోంది.

తరచూ సంచలన వ్యాఖ్యలు చేసే రఘురామ మీద మొదట్లో ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదని.. ఆయన మాటలకు ప్రాధాన్యత తగ్గినట్లుగా చెబుతున్నారు. దీంతో.. రఘురామ ఏం మాట్లాడితే.. అది మాట్లాడనీయండి.. తర్వాత చూద్దామని పార్టీకి చెందిన నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడో ఒకసారి తానుప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ మీద మాట్లాడితే అదో సంచలనంగా మారుతుంది. అందుకు భిన్నంగా రోజుకో అరగంట పాటు మాట్లాడి.. దానికిసంబంధించిన వీడియోను వదలటం ద్వారా.. సీరియస్ నెస్ తగ్గి.. అదో రోటీన్ వ్యవహరంలా.. కావాలని కత్తి కట్టినట్లుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా.. రఘురామ అదే పనిగా మాట్లాడే ప్రయత్నాన్ని మానుకుంటే మంచిదంటున్నారు. లేకుంటే.. ఏదో ఎజెండాతోనే చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు పట్టించుకోవటం మానేసే ప్రమాదం ఉంది. మరి.. రఘరామ ఏం చేస్తుందో చూడాలి.