ఏమిటేమిటీ….? టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట నుంచి ఇంత మాట వినిపించిందా? బీజేపీలో అగ్ర నేతగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా, ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ నేతగా కొనసాగుతున్న అమిత్ షాను చంద్రబాబు అంత మాట అన్నారా? అది కూడా అమిత్ షా సమక్షంలోనే చంద్రబాబు ఆ మాట అన్నారంటే…కాస్తంత సీరియస్ మేటరేనని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే… అమిత్ షా పనితీరును కీర్తిస్తూ ప్రసంగించిన సందర్భంగా చంద్రబాబు నోట నుంచి ఈ మాట వినిపించింది. అది కూడా పొగడ్త రూపంగానే కానీ.. తెగడ్త రూపంలో కాదు.
శనివారం ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా ఆదివారం కూడా రాష్ట్రంలోనే పర్యటించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఐఎం భవనాల ప్రారంభోత్సవం కోసం వచ్చిన అమిత్ షా… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులను వెంటబెట్టుకుని మరీ ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ లో భాగంగా అమిత్ షా కంటే సీఎం హోదాలో చంద్రబాబే ముందుగానే ప్రసంగించారు.
ఈ సందర్భంగా అమిత్ షా పనితీరును చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. బీజేపీ నేతగానే కాకుండా కేంద్ర హొం శాఖ మంత్రిగా అమిత్ షా పనితీరు చాలా విభిన్నంగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఆరేళ్లుగా హోం మంత్రిగా కొనసాగుతున్న షా… దేశంలో నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించివేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తున్నారని చెప్పారు. షా దెబ్బకు నక్సలైైట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఎన్డీఆర్ బృందాలతో విపత్తు చర్యలను చేపట్టడం, అందులో మంచి ఫలితాలను సాధించడం షాకు మాత్రమే సాధ్యమైందని ఆయన కొనియాడారు.
సీఎంగా తాను ఎంతో కాలం నుంచి అమిత్ షాను చూస్తూ వస్తున్నానని చెప్పిన చంద్రబాబు.. షా పనితీరు తనను మంత్రముగ్ధుడిని చేస్తోందని తెలిపారు. రాజకీయ నేతగా తాను కూడా అలా ఎందుకు పనిచేయలేకపోతున్నానని చాలాసార్లు అనుకుంటూ ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగానే చంద్రబాబు నోట ఈ అసూయ మాట వినిపించింది. షా పని తీరు చూస్తుంటే… కొన్ని కొన్ని సార్లు నాకే అసూయ కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అమిత్ షా విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అతిశయోక్తి అయితే కాదనే చెప్పాలి. ఎందుకంటే… బీజేపీ అదికారంలోకి వచ్చే నాటికి షా ఓ మోస్తరు నేతగానే పరిచయం. మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా…ఆయన కేబినెట్ లో షా హోం మినిస్టర్ గా పనిచేశారు. మోదీ జాతీయ రాజకీయాల్లోకి రాగానే… ఆయన వెంట షా కూడా నేషనల్ పాలిటిక్స్ లోకి వచ్చేశారు. మోదీకి చేదోడువాదోడుగా సాగిన షా… బీజేపీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అఖండ మెజారిటీ రావడానికి షా తీసుకున్న కొన్ని చర్యలే కారణమని చెప్పాలి. నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సాగిన షా… 2019 ఎన్నికల్లో పార్టీ రికార్డు విక్టరీని సాధించగానే… మోదీ కేబినెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆరేళ్లుగా కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్న షా… కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ఆయన సమర్థించుకున్న తీరు ఆయనను బీజేపీలో నెంబర్ 2 పోజిషన్ లో నిలబెట్టింది.