ఏపీ రాజకీయాల్లో చదలవాడ కృష్ణమూర్తిని గురించి తెలియని వారు ఉండరు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆయన ప్రస్తుతం పవర్ స్టార్ నేతృత్వంలోని జనసేనలో ఉన్నారు. అయితే, ఆయన రాజకీయాలలో అవకాశవాద ధోరణిని అవలంబించారనే టాక్ ఉంది. తన ఇష్టాలను గౌరవించే పార్టీలో ఉండడమే ఆయన ఇష్టపడతారని, లేకపోతే.. పార్టీ ఎలాంటిదైనా.. ఆయన పట్టించుకోరని ఆయన అనుచరులు అంటారు. చదలవాడ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇది నిజమేనని అనిపిస్తుంది. ఇక, ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తో ప్రారంభమైంది. అది కూడా గ్రామ పంచాయతీ స్థాయి నుంచి చదలవాడ ఎదిగారు.
అదేసమయంలో సామాజిక సేవలో ఆయన మంచి పేరు సంపాయించుకున్నారు. రాజకీయాలు, సమాజసేవను కూడా ఆయన ఏకకాలంలో నిర్వహించి.. ప్రజలమెప్పు పొందారు. అయితే, కాంగ్రెస్‌లో ఆయన కోరిక నెరవేరలేదు. నెల్లూరు జిల్లాకు చెందిన చదలవాడ.. 1994 ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం.. ఆయనను శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. ఇష్టం లేకపోయినా.. ఆయన అక్కడ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈ క్రమంలో తదపరి ఎన్నికల్లో అయినా..తనకు తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు.
అప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అనడంతో.. కాంగ్రెస్‌కు బై చెప్పి.. టీడీపీలోకి చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చారు. దాదాపు 15 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచి టీడీపీకి విధేయుడిగా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఆయనకు చంద్రబాబు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించారు. అయితే, మరోసారి టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని రెన్యువల్ చేయాలన్న అభ్యర్థనను చంద్రబాబు పక్కన పెట్టడంతో అలిగి.. పార్టీకి దూరమయ్యారు. గత ఏడాది ఎన్నికలకు ముందు పవన్ స్థాపించిన జనసేనలోకి చేరారు.
ఎన్నికల్లో పోటీ చేసి.. భారీగానే ఖర్చు చేసినా.. చదలవాడకు డిపాజిట్లు కూడా దక్కలేదు. నిజానికి ఆయన పవన్ ఇమేజ్‌తో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనుకున్నారు.కానీ, ఆయన ఆశలు నెరవేరలేదు. పైగా పవన్ ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉండడం.. తనను పట్టించుకోకపోవడంపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కృష్ణమూర్తి అనుచరులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే పార్టీనుంచి బయటకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వయో వృద్ధుడు కావడం, ఇక, రాజకీయాల్లో చేరినా.. నేటి తరం దూకుడును తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో చదలవాడ పాలిటిక్స్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. వివాద రహితుడు, సమాజ సేవకుడుగా పేరు తెచ్చుకున్న చదలవాడకు రాజకీయ జీవితం ఆయన ఆశించినంత సంతృప్తి ఇవ్వలేదని అంటున్నారు పరిశీలకులు.