మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు, పెద్దమనుషులు, కోర్టుల జోక్యంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే, సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతిలోని ఎంబీయూ దగ్గర మనోజ్ ఫ్లెక్సీలు తీసివేయడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది.
ఈ క్రమంలోనే యూనివర్సిటీలోనికి మనోజ్, మౌనికలను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయిన మనోజ్ దంపతులు….మంత్రి నారా లోకేశ్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మౌనికతో పాటు నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్…నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సమకాలీన రాజకీయాలు, సినిమాలు, మంచు మోహన్ బాబుతో వివాదం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మనోజ్, మౌనికలు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే లోకేశ్ తో ఈ దంపతుల భేటీ హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలోకి మంచు మనోజ్ రాబోతున్నారా? లోకేశ్ తో అందుకే భేటీ అయ్యారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.
అయితే, ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం లోకేశ్ తో మంచు విష్ణు భేటీ అయ్యారు. ఇక, చంద్రబాబుతో కలిసి మోహన్ బాబు దిగిన ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, లోకేశ్ తో విష్ణు ఉన్న ఫొటోల ఫ్లెక్సీలు తిరుపతిలో కనిపించాయి.
దీంతో, వారిద్దరూ టీడీపీకి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో లోకేశ్ తో మనోజ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. లోకేశ్ తో భేటీ తర్వాత మనోజ్ దంపుతులు రంగంపేటలో జల్లికట్టు ఉత్సవాలు వీక్షించేందుకు వెళ్లారు.