ప్రియాంక బుగ్గలు, సీఎం జింక.. గివేం పోలికలు భాయ్?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎక్కడికక్కడ వివాదాలు కొని తెచ్చే నేతలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఢిల్లీకి చెందిన ఆ పార్టీ మాజీ ఎంపీ రమేష్ బిధూరీ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే… ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. ఇలాంటి సమయంలో పార్టీని ఇబ్బంది పెట్టెల వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ తరఫున ఢిల్లీ సీఎం రేసులో బిధూరీ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాఫై బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. బీజేపీని గెలిపిస్తే… ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల మాదిరిగా నున్నగా మారుస్తామని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. అయినా కూడా బిధూరీలో ఎలాంటి మార్పు వచ్చినట్టు కనిపించలేదు.

తాజాగా ఢిల్లీ సీఎం గా ఉన్న ఆప్ కీలక నేత ఆతీశిఫై బిధూరీ నోరు పారేసుకున్నాడు. గడచిన ఐదేళ్ల పాటు ఢిల్లీని పట్టించుకోని ఆతీశి… ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో జింకలా పరుగెత్తుతున్నారని ఆయన అన్నారు. వెరసి ఆయన ఆతీశిని ఓ జింకతో పోల్చారన్నమాట. సాధారణ మహిళల మీద నోరు పాడుకోవడానికే హడాలిపోతున్న వేళ… బిధూరీ మాత్రం ఏకంగా సీఎం, ఎంపీ హోదాల్లో ఉన్న కీలక మహిళా నేతల మీద ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.