దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని సమస్యలు చుట్టుముట్టాయని చెప్పాలి. ఎన్నికల్లో ఆప్ ఫేవరేట్ గానే బరిలోకి దిగింది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న ఆప్… హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఈ వ్యూహాలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఓ రేంజ్ లో పావులు కదుపుతోంది. ఆప్ ను ఎదుర్కోవడం బీజేపీ కి ఈ దఫా కూడా కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నా.. ఎలాగైనా ఆప్ ను ఓడించి తీరాలన్న కసి బీజేపీ లో కనిపిస్తోంది.
ఇలాంటి కీలక తరుణంలో ఆప్ ను సమస్యలు చుట్టుముట్టాయి. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి మంజూరు చేసింది.
సరిగ్గా ఎన్నికల ముందు ఈ పరిణామం ఆప్ కు పెను ప్రతిబంధకము అని చెప్పాలి. కేజ్రీవాల్ నామినేషన్ వేసేందుకు సిద్దమైన రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే,.. కేజ్రీవాల్ కు మరోవైపు నుంచి కూడా ముప్పు పొంచి ఉంది, ఢిల్లీలో ఎన్నికల వేళ శాంతి భద్రతలను విచ్చిన్నం చేసే దిశగా కదులుతున్న ఖలిస్థాన్ మూకలు కేజ్రీ ని టార్గెట్ చేశాయట. ఈ మేరకు నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసాయి.
ఇలా కీలకమైన ఎన్నికల వేళ… ఓ వైపు కేంద్రం నుంచి విచారణలకు అనుమతులు, ఖలిస్తాని ఉగ్రవాదుల నుంచి నేరుగా కేజ్రీకి ప్రాణ హాని పొంచి ఉండటం ఆప్ కు పెను కష్టాలే స్వగతం చెబుతున్నాయని చెప్పాలి. ఈ సమస్యలను అధిగమించి ఆప్ ఎలా రాణిస్తుందన్న ఆసక్తి నెలకొంది.