బండారు సత్యనారాయణ మూర్తి..టీడీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్. పైగా తూర్పుగోదావరి జిల్లాలో పేరున్న నేత. టీడీపీలో నేతలను కలుపుకొని పోయే నాయకుడిగా కూడా ఆయనకు పేరుంది. ఇటీవల టీడీపీ పార్లమెంటరీ జిల్లాల ఇంచార్జ్‌లను నియమించినప్పుడు.. అత్యంత కీలకమైన కాకినాడ పార్లమెంటు ఇంచార్జ్ పోస్టును బండారు కు అప్పగించింది. నిజానికి ఆయన కోరుకున్నది ఇంతకన్నా మెరుగైన పోస్టే.. అయినా.. ప్రస్తుతానికి సర్దుకుపోతున్నారు. ఇక, కాకినాడలో టీడీపీ విషయానికి వస్తే.. కేడర్ బలంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 5 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.
టీడీపీ ఆవిర్భవించిన కొత్తలో 1984లో తొలిసారి ఇక్కడ కాంగ్రెస్ హవాకు చెక్ పెట్టి విజయం సాధించింది. ఇక, ఆ తర్వాత 1991, 1996, 1999 ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధించింది. 2004, 2009 ఎన్నికల్లో మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి హవాతో కాంగ్రెస్ వరుసవిజయాలు దక్కించుకుంది. తర్వాత 2014లో మరోసారి టీడీపీ విజయం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో తోట నరసింహం విజయం సాధించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరించారు. అయితే, ఈయన పార్టీ కోసం పనిచేయలేదని, కేవలం పదవుల కోసమే పనిచేశారని స్థానిక టీడీపీ నేతల వాదన. పైగాఆయనకు పార్లమెంటరీ నియోజకవర్గంపై కన్నా అసెంబ్లీ రాజకీయాలంటేనే ఇష్టమని ఇక్కడ ప్రచారంలో ఉంది. గత ఏడాది ఎన్నికలకు ముందు పెద్దాపురం అసెంబ్లీ టికెట్ కోసం పట్టుబట్టి.. దక్కకపోవడంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోయారు.
ఇక, దీంతో కాకినాడ లో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఎన్నికల్లో చెలమలశెట్టి సునీల్‌కు టికెట్ ఇచ్చినా.. ఆయన ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత నుంచి ఆయన ఐపు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బండారుకు ఇక్కడ బాధ్యతలు అప్పగించారు. ఈయన ఎంపికపై ఎలాంటి విమర్శలు, వివాదాలు రాలేదు. పైగా ఆయన వల్ల పార్టీ బలపడడం ఖాయమని సీనియర్లు కూడా భావిస్తున్నారు.
తాజాగా బండారు సత్యనారాయణ మూర్తి.. కాకినాడ నియోజకవర్గంపై మీటింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తును నిర్దేశించారు. రాబోయే రోజుల్లో కమిటీలు వేసి.. పార్టీని మరింత పటిష్టం చేసేలా ముందుకు సాగనున్నట్టు చెప్పారు. మొత్తానికి కాకినాడలో కేడర్‌ను నిలబెట్టుకునే క్రమంలో చంద్రబాబు చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు సీనియర్లు.