హెల్మెట్ లేదా?… పెట్రోల్ పోయరబ్బా!

చాలా రోజుల నుంచి ఈ మాట వింటున్నదే కదా… ఇప్పుడు ఇందులో కొత్తేముంది అంటారా? నిజమే… చాలా రోజులుగా ఈ మాట వినిపిస్తున్నదే. ఎక్కడైనా పెద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో అటు రవాణా అధికారులతో పాటు ఇటు పోలీసు శాఖ కూడా హడావిడి చేయడం మినహా… ఆ తర్వాత ఆ నిబంధనను అంతగా పట్టించుకోవడం లేదు. పెట్రోల్ పంపుల యాజమాన్యాలు దీనిపై పెద్దగా దృష్టే పెట్టడం లేదు కూడా.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు అక్కడి బీజేపీ సర్కారు గట్టి నిర్ణయమే తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇటీవలే అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి ఓ సర్క్యూలర్ జారీ చేశారు.

ఇకపై హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయకుండా… పెట్రోల్ పంపుల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ నిబంధన పక్కాగా అమలయ్యేలా చూడాలని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఒక్క యూపీలోనే ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 26 వేల మంది దాకా మరణిస్తున్నారట. ఈ మరణాల్లో అత్యధిక శాతం హెల్మెట్ లేని కారణంగానే చోటుచేసుకుంటున్నాయట. ఇదే విషయాన్ని ఇటీవలి సమీక్షలో గుర్తించిన యోగి… హెల్మెట్ ను తప్పనిసరి చేస్తే ఈ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు కదా అని అభిప్రాయపడ్డారట.

ఈ క్రమంలోనే ఆయన హెల్మెట్ ను తప్పనిసరి చేసే దిశగా కఠిన చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేశారట. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర రవాణా శాఖ నుంచి తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… హైదరాబాద్ లో ఈ నిబంధనను ఓ మోస్తరుగా అమలు చేస్తున్నా… పెట్రోల్ పంపుల యాజమాన్యాలు అంతగా పట్టించుకోవడం లేదు. పోలీసులు ఛలానాలు రాస్తున్నా… బైకర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. వెరసి ప్రధాన కూడళ్లలోనే హెల్మెట్ ను విధిగా ధరిస్తున్న వాహనదారులు… ఆయా కూడళ్లు దాటగానే.. తలపై ఉన్న హెల్మెట్ ను తీసి డిక్కీలోనో, లేదంటే హ్యాండిళ్లకో తగిలించేసుకుని వెళుతున్న వైనం స్పష్టంగానే కనిపిస్తోంది.

మరోవైపు ఏపీలో ఇటీవలి కాలంలో హెల్మెట్ ధారణను తప్పనిసరి చేస్తూ కూటమి సర్కారు పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రాష్ట్రంలోని అన్ని నగరాల్లో హెల్మెట్ ఆవశ్యకతను వాహనదారులకు వివరిస్తున్నారు. కొన్ని నగరాల్లో అయితే పోలీసులు ఏకంగా హెల్మెట్ స్టాకులను పక్కనపెట్టుకుని నిలబడుతున్నారు.

ఫలితంగా ఏపీలో హెల్మెట్ ల వినియోగం ఇటీవల బాగానే పెరిగింది. యూపీ మాదిరిగా హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయమన్న నిబంధన తీసుకువస్తే… మరింత మంచి ఫలితాలు వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.