చంద్ర‌బాబు లేని లోటును ప‌వ‌న్ క‌ల్యాణ్ తీర్చ‌నున్నారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19న స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్ కు వెళ్ల‌నున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ జ‌రిగే ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల సద‌స్సులో ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేసుకున్నారు. ఏయే రంగాల్లో ఏపీకి పెట్టుబ‌డులు ఆహ్వానించాలి.. పెట్టుబ‌డులు పెట్టేవారికి ఇక్క‌డ ఉన్న అవ‌కాశాలు, ఇచ్చే సౌక‌ర్యాలు.. యువ‌త‌, ఉపాధి.. ఇలా అనేక విష‌యాల‌పై ప‌క్కాగా ప్ర‌ణాళిక రూపొందించుకున్నారు.

ప్ర‌స్తుతం సంక్రాంతిని పుర‌స్క‌రించుని త‌న సొంత గ్రామం చంద్ర‌గిరి మండ‌లంలోని నారా వారి ప‌ల్లెకు వెళ్లిన సీఎం చంద్ర‌బాబు కుటుంబం ఈ పండుగ సంబ‌రాలు పూర్తికాగానే.. తిరిగి పాల‌న‌పై దృష్టి పెట్టి.. అనంత‌రం దావోస్ ప‌ర్య‌టన‌కు సీఎం సిద్ధం కానున్నారు. ఈ క్ర‌మంలో పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు త‌న‌తో వ‌చ్చే బృందాన్ని కూడా సీఎం చంద్ర‌బాబు రెడీ చేసుకున్నార‌ని సీఎంవో వ‌ర్గాలు పేర్కొన్నాయి. సీఎం వెంట ఇద్ద‌రు మంత్రులు మాత్ర‌మే ఉండ‌నున్నారు.

అయితే.. వీరిలో ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ పేరు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. ఈ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న రాష్ట్రంలోనే ఉండిపాల‌నా యంత్రాంగాన్ని వారం రోజుల పాటు ముందుకు న‌డిపించ‌నున్నారు. అంటే ఒక‌ర‌కంగా చంద్ర‌బాబు లేని లోటును ప‌వ‌న్ క‌ల్యాణ్ తీర్చ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వెంట వెళ్లే బృందంలో ఎవ‌రున్నార‌నే విష‌యంపై ఆస‌క్తి పెరిగింది.

వీరే పెట్టుబ‌డులు తెచ్చేది..

1) ముఖ్యమంత్రి చంద్రబాబు
2) మాన‌వ వ‌న‌రుల శాఖ‌ మంత్రి నారా లోకేశ్
3) ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భరత్
4) సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా
5) సీఎం భ‌ద్ర‌తా అధికారి శ్రీనాథ్
6) ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్
7) ఏపీ ఈడీబీ సీఈవో సాయి కాంత్ వర్మ
8) కుప్పం ప్రాంతీయ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి(కాడా పీడీ) వికాస్ మర్మత్