తిరుప‌తి తొక్కిస‌లాట: బాధితుల‌కు ప‌రిహారం అందించిన చైర్మన్

వైకుంఠ ఏకాద‌శి రోజు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాల‌ని వ‌చ్చి.. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస లాట‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి ఆదుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అన్ని వైపుల నుంచి బోర్డుపై ఒత్తిళ్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

స‌ర్కారు త‌ర‌ఫున ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌లు మార్లు డిమాండ్ చేశారు. ఇక‌, సీఎం చంద్ర‌బాబు కూడా.. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం పాల‌క మండ‌లి క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు, న‌గ‌దు రూపంలో ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చింది.

శుక్ర‌వార‌మే దీనిపై పాల‌క మండ‌లి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ క్ర‌మంలో తాజాగా శ‌నివారం.. కొంద‌రు బాధితుల‌కు టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు ప‌రిహారం చెక్కులు అందించారు. తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు 5లక్షలను అందించారు.

వారికి సంబంధించిన ప‌రిహారం డిమాండ్ డ్రాఫ్ట్‌(డీడీ)ల‌ను చైర్మ‌న్ నాయుడు తిరుపతిలోనే స్వ‌యంగా వారికి అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న “స్వల్పంగా గాయపడిన నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్నపాపయ్యలకు 2లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం“ అని పేర్కొన్నారు.

సిఎం ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటన బాధితులకు పరిహారం ఇస్తున్నట్టు నాయుడు తెలిపారు. ఇక‌, మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల పరిహారాన్ని టిటిడి పాలకమండలి సభ్యులు అందజేస్తారని, రెండు బృందాలుగా ఏర్పడి టిటిడి పాలకమండలి సభ్యులు మృతుల స్వస్థలాలకు వెళ్ళి డిడిలను అందజేస్తారని తెలిపారు. ఆదివారం ఉద‌యం బాధితుల ఇళ్ల‌కు వెళ్లి.. ఆయా కుటుంబాల‌కు ప‌రిహారం అందిస్తారు.

స‌ర్కారు ప్ర‌క‌టించిన న‌ష్ట‌ప‌రిహారాన్ని చెక్కు/డీడీల‌ రూపంలో అందిస్తారు. ఆ వెంట‌నే మృతి చెందిన వారి కుటుంబాల్లోని అర్హుల‌కు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఉద్యోగం క‌ల్పించే హామీ ప‌త్రాన్ని కూడా అందిస్తారని తెలిసింది. పాల‌క మండ‌లి స‌భ్యులు రెండు బృందాలుగా ఏర్ప‌డి విశాఖ‌, న‌ర్సీప‌ట్నం వంటి ప్రాంతాల‌కు కూడా వెళ్లి ఆయా కుటుంబాల‌కు సాయంతో అందించ‌నున్నారు.