మోదీ ఊరికి చైనా అధ్యక్షుడితో అనుబంధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని తన స్వగ్రామం వాద్‌నగర్‌కు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని గుర్తుచేశారు. ఈ అనుబంధం వెనుక బౌద్ధ యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ పాత్ర ఉందని చెప్పారు.

మోదీ వివరించిన ప్రకారం, 2014లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రపంచ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్ చేసి స్వయంగా అభినందించినప్పుడు, తన స్వగ్రామం వాద్‌నగర్‌ను సందర్శించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారట.

మోదీ దీనికి ఆశ్చర్యపడి కారణం అడగగా, హ్యూయెన్ త్సాంగ్ వాద్‌నగర్‌లో నివసించాడని, ఆ తరువాత మా ప్రాంతంలో కూడా నివసించారని జిన్‌పింగ్ తెలిపారు. ఇది విన్న మోదీకి తమ ఊరుకు అంతటిదూరంలో చైనా అధ్యక్షుడికి సంబంధం ఉందని తెలుసుకుని ఆశ్చర్యమేసిందట.

ఈ చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేస్తూ, జిన్‌పింగ్ భారతదేశ పర్యటన సందర్భంగా 2014 సెప్టెంబర్ 17న గుజరాత్‌ను సందర్శించారు. ఈ రోజు మోదీ 64వ పుట్టినరోజు కావడం విశేషం. ఆ సందర్శనలో వాద్‌నగర్ చరిత్రను మరింత లోతుగా పరిశీలించిన జిన్‌పింగ్, రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని పునరుద్ధరించారు.

వాద్‌నగర్ చరిత్రలో బౌద్ధ ధర్మం ద్వారా ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న ఈ సాన్నిహిత్యం, భారత చైనా సంబంధాలను బలపరిచే చారిత్రక సందర్భంగా నిలిచింది. హ్యూయెన్ త్సాంగ్ నివాసం చరిత్రను ప్రస్తావిస్తూ మోదీ జ్ఞాపకాల్ని పంచుకోవడం సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.