జగనన్న కాలనీలు కాదు… మరేంటి!

ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో నూతనంగా వెలసిన వైఎస్సార్ జగనన్న కాలనీల పేరును మారుస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీలుగా జనాల్లో బాగానే ప్రచారం పొందిన ఈ కాలనీలను ఇకపై పీఏంఏవైై ఎన్టీఆర్ నగర్ లుగా పరిగణించాలని తీర్మానించింది. ఈ మేరకు జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగర్ లుగా మారుస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత జగన్ సీఎం అయ్యారు. సంక్షేమంలో నూతన పథకాలంటూ ప్రచారం చేసుకున్న జగన్… పలు కొత్త పథకాలనూ అమలు చేశారు. అదే సమయంలో పలు కీలక హామీలను అమలు చేయలేక చేతులెత్తేశారు. ఈ క్రమంలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇస్తామంటూ కొత్త పథకానికి రూపకల్పన చేశారు. అందులో భాగంగా దాదాపుగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలను ఇచ్చారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లలో వైైసీపీ నేతలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపించాయి.

ఇలా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన జగన్ సర్కారు… ఆ ఇళ్ల స్థలాలకు మౌలిక సదుపాయాలను కల్పించే పనిని కొంతమేరకు చేపట్టింది. అయితే చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు అయితే మొదలు కాలేదు. ఇలా జగన్ పాలనలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఓ బోర్డు పెట్టేసి…వాటికి వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు పెట్టేసింది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు… తాజాగా ఈ కాలనీల పేరును ఎన్టీఆర్ నగర్ లుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.