జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో పోల్చితే… పవన్ రాజకీయం చాలా డిఫరెంట్ గానే కనిపిస్తుంది. అదే సమయంలో ఆయన ప్రజల పట్ల మాట్లాడే తీరు గానీ, ప్రజా సమస్యలపై స్పందించే తీరు కూడా ఇతరులతో పోల్చితే టోటల్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పక తప్పదు. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందన్నది ఈ సంక్రాంతి తర్వాత మరింత స్పష్టంగా కనిపించనుంది. ప్రస్తుతం సంక్రాంతి సంబరాల కోసం తన సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్లిన పవన్… పండుగను అక్కడి ప్రజల మధ్యనే జరుపుకోనున్నారు.
సంక్రాంతి ముగియగానే పవన్ పలగ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి పవన్ పల్లెల పర్యటన ప్రారంభం కానుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ పర్యటనల్లో భాగంగా ప్రతి జిల్లాలో అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేస్తారు. ఆ గ్రామాల్లోనే పవన్ పర్యటిస్తారు. గ్రామాల్లో పవన్ పర్యటన అంటే… ఏదో అలా పల్లెల్లో అడుగు పెట్టేసి… అలా అలా అక్కడి ప్రజలతో మాటా మంతి కలి వెనుదిరగడం కాదు. ఆ గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతూ… వారితో కలిసి ఆ గ్రామాల్లో పవన్ బస చేస్తారు.
ఓ రకంగా చెప్పాలంటే… ఈ పర్యటనలకు పల్లె నిద్ర అని పేరు పెడితే సరిపోతుందేమో. సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శిక్షణలో భాగంగా ఇలా కొన్ని పల్లెలకు వెళ్లి వాటిలోనే కొంతకాలం పాటు బస చేస్తారు. అక్కడి పస్రజానీకం జీవన విధానాలను పరిశీలిస్తారు. వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. సరిగ్గా.. ఇప్పుడు పవన్ కూడా వారి మాదిరిగానే గ్రామాల్లో పర్యటించనున్నారు. తాను వెళ్లే గ్రామాల్లోనే టెంపరరీ టెంట్లు వేసుకునే పవన్… వాటిలోనే బస చేస్తారు. ఆ టెంట్ల నుంచే తన రోజువారీ విధులను నిర్వహిస్తారు. అదే సమయంలో ఆయా గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలపరిష్కారం కోసం కృషి చేస్తారు. ఈ పర్యటనలతో పవన్ స్థాయి ఓ రేంజికి చేరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.