“మా బంధం ద్రుఢ‌మైంది..” బీజేపీతో పొత్తుపై చంద్ర‌బాబు

బీజేపీతో త‌మ బంధం ద్రుఢ‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాము బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని చెప్పారు. విశాఖ‌లో నిర్వ‌హించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌తిష్ఠ‌ను ప్రపంచ స్థాయికి చేర్చార‌ని చెప్పారు. ఆయ‌న చేప‌ట్టిన అనేక కార్య‌క్ర‌మాలు ప్ర‌పంచ దేశాలు కూడా అనుస‌రించే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. మేకిన్ ఇండియా నుంచి అనేక కార్య‌క్ర‌మాలు ఆద‌ర్శవంతంగా అమ‌లవుతున్నాయ‌ని తెలిపారు.

రాష్ట్ర రాజ‌కీయాల్లో 2024లో బీజేపీ-జ‌న‌సేన-టీడీపీ విజ‌యం సంచ‌ల‌న‌మ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇలాంటి విజ‌యం క‌నీ వినీ ఎరుగ‌లేద‌న్నారు. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుని అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. తామంతా బీజేపీ వెంట‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వెంటే ఉంటామ‌ని తేల్చి చెప్పారు. ప్ర‌ధాని దార్శ‌నిక పాల‌న‌లో దేశం పురోభివృద్ధిలో ముందుకు సాగుతోంద‌న్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు చేరువైన నాయ‌కుడు న‌రేంద్ర మోడీనేన‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

దేశం కోసం ప్ర‌ధానిగా మోడీ అహ‌ర్నిశ‌లూ ప‌నిచేస్తున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఆయ‌న వెంటే తాము ముందుకు న‌డుస్తామ‌న్నారు. రైల్వే జోన్ స‌హా అనేక ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేశార‌ని.. దీంతో రాష్ట్రం మ‌రింత అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతుంద‌ని చెప్పారు. “నేనూ, మోడీ ఒకేలా ఆలోచిస్తాం. ఎంత సేపూ.. ప్ర‌జ‌లకు ఏం చేయాల‌న్న దానిపై దృష్టి పెడ‌తాం. అందుకే దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలోనే మోడీ నాయ‌క‌త్వానికి ఎన‌లేని మార్కులు ప‌డుతున్నాయి. మోడీని నేను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటా” అని చంద్ర‌బాబు అన్నారు.

ప్ర‌ధాని మోడీ చేస్తున్న సాయంతోనే ఏపీలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అమ‌రావ‌తి నిర్మాణంలో ప్ర‌ధాని స‌హ‌కారాన్ని మ‌రింత కోరుకుంటున్న‌ట్టు వేదిక‌పై చంద్ర‌బాబు చెప్పారు. మోడీ శంకు స్థాప‌న చేసిన‌, తాము క‌ల‌లు క‌న్న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్టు తెలిపారు. “ఇలాంటి ప్ర‌ధాన మంత్రులు ఎంత మంది ఉంటారు” అని చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు. కాగా, చంద్ర‌బాబు ప్ర‌సంగం ఆసాంతం తెలుగులోనే సాగింది.