తిరుప‌తి క్యూలైన్లో తోపులాట‌.. ఎంత మంది చనిపోయారు

ఈ నెల 10 శుక్ర‌వారం నాడు వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల పంపిణీని గురువారం తెల్ల‌వారుజాము నుంచి ప్రారంభించ‌నుంది. అయితే.. వివిధ ప్రాంతాల నుంచి బుధ‌వారం మ‌ధ్యాహ్న‌మే తిరుప‌తి చేరుకున్న భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో గుమిగూడారు. ఇక‌, క్యూలైన్ల‌లోకి వారిని బుధ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఒకేసారి అనుమ‌తించ‌డంతో తోపులాట‌, తొక్కిస‌లాట కూడా చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికాగా.. ఓ మ‌హిళ తో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

ఏం జ‌రిగింది?

ఏకాద‌శి-పుణ్య‌తిధి. ఇది శ్రీమ‌న్నారాయ‌ణునికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన రోజుగా పేర్కొంటారు. ఇక‌, ఏడాదికి ఒక్క‌సారి మాత్ర‌మే వ‌చ్చే వైకుంఠ ఏకాద‌శికి మ‌రింత విశేషం ఉంటుంది. ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నంలో శ్రీవారు ద‌ర్శ‌న‌మిస్తారు. విష్ణాల‌యాలు ఎక్క‌డున్నా.. వైకుంఠ ఏకాద‌శి నాడు.. ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నం ఏర్పాటు చేస్తారు. ఇక‌, తిరుమ‌ల‌కు వ‌చ్చే స‌రికి సాధార‌ణ ద‌ర్శ‌నం కంటే కూడా.. ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నానికి మ‌రింత ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వైకుంఠ ఏకాద‌శి వ‌స్తోందంటేనే.. తిరుమ‌ల‌కు భారీ సంఖ్య‌లో భ‌క్తులు క్యూ క‌డుతుంటారు.

తాజాగా శుక్ర‌వారం వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని మూడు రోజుల పాటు భ‌క్తుల‌కు శ్రీవారి ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నాలు క‌ల్పి స్తున్నారు. మొత్తంగా 1.2 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. వివిధ ప్రాంతాల నుంచి ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు తిరుప‌తికి చేరుకున్నారు.

బుధ‌వారం రాత్రి 9 గంట‌ల త‌ర్వాత‌.. భ‌క్తుల‌ను క్యూలైన్ల‌లోకి అనుమ‌తించారు. ఈ క్ర‌మంలో తిరుప‌తిలోని శ్రీనివాసం క్యూలైన్‌లోకి భ‌క్తుల‌ను ఒకే సారి విడుద‌ల చేయ‌డంతో భారీ ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. ఈక్ర‌మంలో త‌మిళ‌నాడులోని సేలం జిల్లాకు చెందిన మ‌ల్లిక అనే మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు కూడా తీవ్ర తొక్కిస‌లాట‌తో గాయ‌ప‌డ్డారు. దీంతో వారికి హుటాహుటిన ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. వీరిలో ముగ్గురు నుంచి న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. కాగా.. తొక్కిస‌లాట‌కు అధికారుల ప్ర‌ణాళికా లోపాలే కార‌ణ‌మ‌ని భ‌క్తులు ఆరోపిస్తున్నారు.

ఉన్న‌ట్టుండి ఒక్కసారిగా భ‌క్తుల‌ను వ‌దిలేద‌య‌డం.. నియంత్ర‌ణ లోపించ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని బాధిత భ‌క్తుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, గురువారం ఉద‌యం 5 గంట‌ల నుంచి భ‌క్తుల‌కు టోకెన్లు అందించ‌నున్నారు.