ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలోని మిగతా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తు..దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో ఎత్తు. 2014 నుంచి వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం మాత్రం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. హ్యాట్రిక్ కొట్టిన ప్రధాని మోడీ హవా కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్రేజ్ ముందు పనిచేయలేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 స్థానాలకు ఓకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుందని భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుందని వెల్లడించారు.

ప్రస్తుతం అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి అసెంబ్లీలో 62 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి 8 మంది ఎమెల్యేలు మాత్రమే ఉన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్‌..ఈ సారి ఎన్నికల్లో మెజారిటీ సీట్లను చీపురు గుర్తుతో ఊడ్చేసి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది. ఆప్ జోరుకు కళ్లెం వేయాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఈ సారి కాంగ్రెస్, ఆప్ ల మధ్య పొత్తు ఉండబోదని కేజ్రీవాల్ ప్రకటించడంతో అక్కడ ముక్కోణపు పోరు తప్పలేదు. కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి పొత్తు ఉందని, అది బహిరంగంగా ప్రకటించాలని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు మీడియా ప్రతినిధులు తప్ప కాంగ్రెస్ పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2025 షెడ్యూల్ ఇదే:

నోటిఫికేషన్ విడుదల తేదీ : జనవరి 10

నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: జనవరి 17

నామినేషన్ల పరిశీలన: జనవరి 18

నామినేషన్ల ఉపసంహరణ గడువు: జనవరి 20

పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 5

ఎన్నికల ఫలితాల తేదీ: ఫిబ్రవరి 8