మన దేశంలో నేరం చేసిన కొందరు వ్యక్తులు ఎంచక్కా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. అలా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లలను ట్రాక్ చేసేందుకు, వారిని పట్టుకునేందుకు..ఆ క్రమంలో ఇంటర్ పోల్ తో కనెక్ట్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేదు. ఈ క్రమంలోనే ఇకపై ఆ సమస్యకు చెక్ పెట్టేలాగా ఇంటర్ పోల్ తో వేగంగా కనెక్ట్ అయ్యేందుకు ‘భారత్ పోల్’ పోర్టల్ ను కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు.
జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడం, వారి కదలికలపై ఓ కన్నేసి వారిని పట్టుకోవడం లక్ష్యంగా భారత్ పోల్ పోర్టల్ ను సీబీఐ రూపొందించింది. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన భారత్ పోల్ పోర్టల్ ద్వారా భారత దేశపు పోలీసులు క్రిమినల్ రికార్డులను చిటికెలో అప్‌లోడ్ చేయవచ్చు.
ఆ అప్ లోడ్ అయిన వివరాలతో ఇంటర్‌పోల్‌ను అలర్ట్ చేయవచ్చు. అంతర్జాతీయ నేరగాళ్లు ఏ దేశంలో దాక్కున్నా సరే వారిని కలుగులో నుంచి బయటకు తెచ్చేందుకు భారత్ పోల్ ఉపయుక్తంగా ఉంటుంది. భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం కాక ముందు మన దేశంతోపాటు విదేశాలకు పారిపోయిన నేరస్థుల సమాచారం సేకరించడం, అరెస్టు చేయడం ఓ పెద్ద ప్రహసనం.
ఆ నేరస్తుల సమాచారం కోసం ఆయా రాష్ట్రాల పోలీసులు, దర్యాప్తు సంస్థలు నేరుగా ఇంటర్‌పోల్ ను ఆశ్రయించాల్సి ఉండేది. అందుకుగాను, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా సీబీఐని సంప్రదించి…ఆ తర్వాత సీబీఐ వెళ్లి ఇంటర్‌పోల్‌ను సంప్రదించి…అప్పుడు నోటీసులు జారీ అయ్యేవి. ఈ ప్రాసెస్ పూర్తయ్యే లోపు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్న రీతిలో చాలామంది నేరగాళ్లు తమ లొకేషన్ మార్చేస్తుంటారు.
అయితే, ఇకపై వారికి ఆ చాన్స్ ఉండదు. భారత్ పోల్ టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నేరుగా భారత్‌పోల్‌తో కనెక్ట్ అవుతారు. నేరగాళ్ల సమాచారం కోసం భారత్‌పోల్ ద్వారా నేరుగా ఇంటర్‌పోల్ ను సంప్రదిస్తారు. ఇంటర్‌పోల్ ఆ అభ్యర్థనకు ఒప్పుకుంటే సదరు నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర నోటీసులు వెంటనే జారీ చేస్తుంది.
ఇంటర్‌పోల్‌తో ఫాస్ట్ గా కమ్యూనికేట్ కావడం, ఆ తర్వాత వెంటనే నోటీసులు జారీ అయ్యేలా చేసి నేరస్థులను వీలైనంత త్వరగా పట్టుకోవడం భారత్ పోల్ పోర్టల్ లక్ష్యం.