రేవంత్ కోరిక‌ల చిట్టా.. ప్ర‌ధాని చిరున‌వ్వులు.. ఏం జ‌రిగింది?

ఏ రాష్ట్ర‌మైనా కేంద్రం ముందు ఒక‌ప్పుడు త‌ల ఎగ‌రేసిన ప‌రిస్థితి ఉండేది. ప‌ట్టుబ‌ట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా క‌నిపించేవి. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఎవ‌రూ కేంద్రం ముందు గ‌ట్టిగా మాట్లాడే ప‌రిస్థితి లేకుండా పోయింది.

రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక మెట్టు తగ్గాల్సిందే. రాజ‌కీయంగా ఫైర్ అయినా.. కేంద్రం వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి ఫ్ల‌వ‌ర్లుగా మారుతున్న ప‌రిస్థితి దాదాపు అన్ని రాష్ట్రాల ద‌గ్గ‌ర క‌నిపిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని మోడీపై బ‌హిరంగ స‌భ‌ల్లో విరుచుకుప‌డ‌తారు.

కానీ, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విష‌యానికి వ‌స్తే మాత్రం నాలుగు మెట్లు దిగి మాట్లాడ‌తారు. ఇదీ.. ప్ర‌స్తుతం రాష్ట్రాల ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా..అనేక కోరిక‌ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి చాలా సుదీర్ఘ‌కంగా.. వివ‌ర‌ణాత్మ‌కంగా ఆయ‌న మ‌న‌సును మెప్పించేలా.. కూడా చెప్పుకొచ్చారు.

అంతేకాదు..“మీరు భావిస్తున్న విక‌సిత భార‌త్‌తో మేమూ భాగ‌స్వాముల‌వుతాం“ అంటూ.. పార్టీపరంగా ఉన్న వైరాన్ని కూడా ప‌క్క‌న పెట్టి సీఎంగా ఆయ‌న చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. తాము కోరిన కోరిక‌లు నెరవేర్చితే.. కేంద్రం ఆశిస్తున్న 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల సృష్టిలో తాము కూడా క‌లిసి వ‌స్తామ‌న్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం రేవంత్ కేంద్రం నుంచి అనేక కోరిక‌లు కోరారు. అయి తే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాత్రం చాలా చిద్విలాసంగా ఆయా కోరిక‌ల‌ను విన్నారు.

కానీ, ఒక్క‌దానికి కూడా ఆయ‌న చేస్తాను అనికానీ, చూస్తాను.. అని కానీ చెప్ప‌లేదు. దీంతో రేవంత్ త‌ను చెప్పుకోవాల్సిన వ‌న్నీ చెప్పేసుకుని మైకు క‌ట్టేశారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రేవంత్ రెడ్డి కోరిక‌ల్లో కొన్ని!

+ వ‌రంగ‌ల్ -బందర్ పోర్ట్‌కు రైల్వే లైన్‌కు అనుమతి.

+ తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు.

+ రాష్ట్రంలో ఫార్మా ఇండస్ట్రీకి ఊతం.

+ ఎలక్ట్రిక్ వేహికిల్ తయారీకి అనుమతి.

+ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ ఆర్ ఆర్‌)కు స‌మాంత‌రంగా రీజనల్ రైల్ ఏర్పాటు.

+ రైల్ రింగ్‌కు అనుమతి.

+ వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణం.