పేప‌ర్ మిల్లు మూత‌… ఏం జరిగింది?

ఏపీలో కూట‌మి స‌ర్కారుకు పెద్ద చిక్కే వ‌చ్చింది. ఒక‌వైపు ఉపాధి, ఉద్యోగాల క‌ల్ప‌న‌తో ముందుకు సాగు తున్న స‌ర్కారుకు.. ఇప్పుడు `లాకౌట్‌` రూపంలో పెను స‌వాల్ ఎదురైంది. రాజ‌మండ్రిలోని `అంత‌ర్జాతీయ ఏపీ పేప‌ర్ మిల్స్‌`కు యాజ‌మాన్యం తాళం వేసింది.

ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కుండానే లాకౌట్ చేయ‌డంతో ప్ర‌త్య‌క్షంగా 52 వేల మంది , ప‌రోక్షంగా 4 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం చూపుతోంది. దీనిపై యాజ‌మాన్యం మౌనంగా ఉంది. మ‌రోవైపు కార్మికులు ఆందోళ‌న‌కు దిగి స‌ర్కారుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టారు.

ఏం జ‌రిగింది..?

ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో సుదీర్ఘ కాలంగా ఏపీ పేప‌ర్ మిల్స్ ర‌న్ అవుతోంది. దాదాపు ఐదేళ్లుగా ఇందులో ప‌నిచేస్తున్న కార్మికుల‌కు జీతాలు పెంచ‌లేద‌ని స‌మాచారం. దీంతో గ‌త ఐదు రోజులు గా కార్మికులు, ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగారు.

ఈ క్ర‌మంలో రెండు సార్లు కార్మికుల‌తో చ‌ర్చ‌లు చేప‌ట్టిన యాజ‌మాన్యం.. ఎలాంటి సానుకూల నిర్ణ‌యం తీసుకోలేదు. పైగా తాము న‌ష్టాల్లో ఉన్నామ‌ని ఇప్పుడు వేత‌నాలు పెంచ‌డం సాధ్యం కాద‌ని కూడా తేల్చి చెప్పింది.

దీంతో కార్మికులు నిర‌స‌న బాట‌ప‌ట్టారు. ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే.. సోమ‌వారం తెల్ల‌వారు జామున మూడు గంట‌ల‌కే.. పేప‌ర్ మిల్స్ యాజమాన్యం ప‌రిశ్ర‌మ‌కు తాళం వేసి.. లాకౌట్ బోర్డును వేలాడ‌దీసింది.

దీంతో కార్మికులు హ‌తాశుల‌య్యారు. ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించడంపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతూ.. యాజమాన్యానికి వ్యతిరేకంగా మ‌రిన్ని ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు.

కార్మికుల ఆందోళన విషయం తెలిసి పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని కార్మికుల‌తో చ‌ర్చించారు. కార్మికులు మాత్రం త‌మ నిర‌స‌న‌ను విర‌మించేది లేద‌ని.. ఈ విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల వేత‌నాలు కూడా త‌మ‌కు ఇవ్వ‌లేద‌ని కార్మికులు చెబుతున్నారు.

పేరు గొప్పే!

అంత‌ర్జాతీయ ఏపీ పేప‌ర్ మిల్స్‌ను రాజమండ్రిలో 1898లో ప్రారంభించారు. బ్రిటీష్ వారి హ‌యాంలోనే విదేశాల‌కు కూడా పేప‌ర్‌ను ఎగుమ‌తి చేసిన ఘ‌న‌త ఉంది. అయితే.. జీఎస్టీ భారాలు, ప్ర‌భుత్వం నుంచి స‌రైన ప్రోత్సాహం లేక‌పోవ‌డం, క‌రోనా ఎఫెక్ట్‌, ద్ర‌వ్యోల్బ‌ణం, పేప‌ర్ మిల్స్ పెరిగిపోయిన ద‌రిమిలా.. సంస్థ న‌ష్టాల బాట ప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ వ్య‌వ‌హారం కూట‌మి ప్ర‌భుత్వానికి తీవ్ర త‌ల‌నొప్పిగా మార‌డం గ‌మ‌నార్హం.