భ‌క్తుల‌కు చేరువ‌గా చైర్మ‌న్‌.. టీటీడీ ప్ర‌క్షాళ‌న!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప్ర‌క్షాళ‌న కొన‌సాగుతూనే ఉంది. అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భ‌క్తుల‌కు-భ‌గ‌వంతుడికి మ‌ధ్య టీటీడీ బోర్డు ఉంటుంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న వ్య‌క్తి భ‌క్తుల‌కు క‌నిపించ‌డం చాలా చాలా అరుదు.

ఏదైనా ఉత్స‌వాల స‌మ‌యంలో మాత్ర‌మే ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి.. వాహ‌న‌సేవ‌లో పాల్గొని అలా వెళ్లిపోతారు. సాధార‌ణ భ‌క్తులకు క‌నిపించ‌డం కూడా చాలా క‌ష్టం. వారు వీరు అని తేడా లేదు. ఎవ‌రు ప్ర‌భుత్వంలో ఉన్నా.. టీటీడీ చైర్మ‌న్ అంటే.. శ్రీవారి కంటే గోప్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం తెలిసిందే.

అలాంటిది తాజాగా నెల‌కురెండు సార్లు సాధార‌ణ భ‌క్తుల‌కు చేరువ కావాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌స్తుత టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి నెల 5, 20 తేదీల్లో ఆయ‌న సాధార‌ణ భ‌క్తుల‌కు చేరువ అవుతున్నారు. వారి స‌మ‌స్య‌లు వింటున్నారు. వారితో నేరుగా మ‌మేకం అవుతున్నారు.

అదేస‌మ‌యంలో సాధార‌ణ భ‌క్తుల క్యూలైన్ల‌ను కూడా ప‌రిశీలిస్తున్నారు. వారికి అందుతున్న సౌక‌ర్యాలు, స‌మ‌స్య‌ల‌పై అధికారుల నుంచి కూడా వివ‌రాలు తీసుకుని.. వాటిలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేస్తున్నారు. దీంతో టీటీడీ.. సాధార‌ణ‌ భ‌క్తుల‌కు మ‌రింత చేరువ అయింది.

ఆదివారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు సాధార‌ణ భ‌క్తుల‌కు చేరువ‌గా ఉన్నారు. అఖిలాండం నుంచి సంగీత సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే `నాద నీరాజ‌నం`వేదిక దాకా క‌లియదిరిగారు. సాధార‌ణ భ‌క్తుల‌ను క‌లుసుకున్నారు.

అక్క‌డే కూర్చున్నారు. వారితో పిచ్చాపాటి సంభాషించారు. మెరుగైన సేవ‌ల‌పై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాద నాణ్య‌త‌ను, రూంలు అందుబాటులో ఉన్న వైనాన్ని..టికెట్లు ల‌భిస్తున్న తీరును ఇలా.. అనేక విష‌యాల‌ను బీఆర్ నాయుడు తెలుసుకున్నారు. మెజారిటీ సంఖ్య‌లో భ‌క్తుల‌ను ఆయ‌న క‌లుసుకోవ‌డం విశేషం.

ఇదేస‌మ‌యంలో సాధార‌ణ భ‌క్తులు ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న అదికారుల‌కు అప్ప‌టిక‌ప్పుడే డిక్టేట్ చేసి.. న‌మోదు చేయించారు. వాటిని సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లడ్డూ, అన్నప్రాదాలు నాణ్యంగా రుచికరంగా ఉన్నాయని.. పరిశుభ్రత పెరిగిందని ప‌లువురు సాధార‌ణ‌ భక్తులు చైర్మ‌న్‌కు వెల్ల‌డించారు.

సేవ‌ల ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే.. శ్రీవారి ద‌ర్శ‌నం స‌మ‌యంలో త‌మ‌ను భ‌ద్ర‌తా సిబ్బంది వేగంగా లాగేస్తున్నార‌ని.. ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చుకుని వ‌చ్చే త‌మ‌కు క‌నీసం ద‌ర్శ‌నం మ‌న‌స్పూర్తిగా అయ్యేలా చూడాల‌ని క‌ర్ణాట‌క‌కు చెందిన భ‌క్తులు విన్న‌వించారు.