పార్టీ నేతల్లో మొదలైన ‘ఏలూరి’ టెన్షన్

ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీలో ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు టెన్షన్ మొదలైందిట. ఈమధ్యనే ఏలూరిని చంద్రబాబునాయుడు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షునిగా నియమించిన విషయం తెలిసిందే. నియామకం జరిగి 15 రోజులు అవుతున్నా ఎంఎల్ఏ ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదట. జిల్లా పార్టీలోని సీనియర్లను కూడా కలవలేదట. తనతో రోజు టచ్ లో ఉండే క్యాడర్ ని తప్ప ఇంకెవరినీ కలవటం లేదట. సరే ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అని విషయం పూర్తిగా ఎంఎల్ఏ ఇష్టమనటంలో సందేహం లేదు. మరి టీడీపీ నేతల్లో ఎందుకు టెన్షన్ పెరిగిపోతోంది ?

ఎందుకంటే ఏలూరికి వైసీపీ నుండి ఒత్తిళ్ళు వస్తున్నాయని, ఏదో రోజు టీడీపీని వదిలేసి వైసీపీలో చేరటం ఖాయమని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో పార్టీకి భవిష్యత్తు లేదన్న కారణంతో ఎంఎల్ఏనే పార్టీ మారిపోదామని అనుకుంటున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కారణం సరిగ్గా తెలియకపోయినా పార్టీ కార్యక్రమాలకు ఏలూరి మాత్రం చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఒక్క ఏలూరే కాదు జిల్లాలో కొండపి ఎంఎల్ఏ డాక్టర్ బాల వీరాంజనేయస్వామి, అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

ఏలూరికి నోవా బ్రాండ్ వ్యవసాయ ట్రాక్టర్ల బిజినెస్ బాగా జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఎంఎల్ఏ బిజినెస్ దెబ్బ తింటోందట. తాను ప్రతిపక్షం ఎంఎల్ఏ కావటం వల్లే తన బిజినెస్ దెబ్బతింటోందనే భావన పెరిగిపోతోందట. దాంతో బిజినెస్ పెంచుకోవటంలో భాగంగానే పార్టీ కార్యక్రమాలతో అంటి ముట్టనట్లున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే ఎంఎల్ఏకి బాపట్ల అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం ఎంత వరకు లాభమో ఎవరికీ అర్ధం కావటం లేదు.

అయితే ఇదే సమయంలో పార్టీ సీనియర్లలో మరో వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ మారిపోతాడనే అనుమానం వల్లే అద్యక్ష పదవిని ఇచ్చి ఏలూరి ముందరి కాళ్ళకు చంద్రబాబు బంధం వేసినట్లు చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు వ్యూహం వర్కవుటవుతుందా ? లేకపోతే ఏలూరి పార్టీ మారటం ఖాయమేనా అన్నది తొందరలోనే తేలిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఏదేమైనా ఏలూరి కారణంగా పార్టీ నేతల్లో అయోమయం మాత్రం రోజురోజుకి పెరిగిపోతోంది.