మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన బస్సులను బీజేపీ నేతలు తగులబెట్టారని, వారి కంటే జగన్ చాలా నయమని జేసీ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఇక, టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీ లతను జేసీ అసభ్య పదజాలంతో దూషించడాన్ని మంత్రి సత్యకుమార్ తో పాటు బీజేపీ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. వయసుకు తగ్గట్లు జేసీ మాట్లాడాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే తాజాగా జేసీకి మాధవీ లత కౌంటర్ ఇచ్చారు.
వయసైపోయిన పెద్ద మనిషి మాట్లాడిన భాషకు ధన్యవాదాలని, ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం తెలుపుతున్నానని మాధవీ లత ఓ వీడియో విడుదల చేశారు. తనపై కేసు నమోదైందని వింటున్నానని, తనకు పోలీసుల నుంచి సమాచారం రాలేదని అన్నారు. అయితే, తనను చంపాలనుకుంటే వెంటనే చంపేయాలని, కానీ, మహిళల రక్షణ కోసం తాను పోరాడుతూనే ఉంటానని మాధవీ లత చెప్పారు.
మహిళల మాన, ప్రాణ సంరక్షణ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని ఆమె అన్నారు. ఒంటరిగానైనా పోరాడతానని తెలిపారు. ఇక, సినిమాల్లో ఉన్నవాళ్లంతా ప్రాస్టిట్యూట్ లు అని ఆయన మాట్లాడారని, కాబట్టి ఆయన జిల్లా నుంచి ఎవరూ ఇండస్ట్రీకి రావొద్దని సూచించారు. తనపై వచ్చే వార్తలు చూసి, తనకు నవ్వొస్తుందని అన్నారు. ఒకసారి తాడిపత్రికి వచ్చి చూడండి.. తాడిపత్రి అంటే ఏంటో.. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో తెలుస్తుంది…అని ఒక నెటిజన్ చేసిన కామెంట్ కు మాధవీ లత స్పందించారు. తాడిపత్రికి వచ్చేందుకు భయమేస్తోందని మాధవీలత రిప్లై ఇచ్చారు.