హైదరాబాద్ వాసులకు.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం 2025 సందర్భంగా శుభాకాంక్షలతో పాటు కానుకను కూడా అందించారు. హైదరాబాద్ మెట్రోను ఉత్తర ప్రాంతానికి కూడా విస్తరించారు. ఈ ప్రాంతంలో మెట్రో విస్తరించాలని కొన్నాళ్లుగా డిమాండ్ ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టినా.. అడుగులు ముందుకు సాగలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తాజాగా అధికారులను ఆదేశించారు. దీంతో ఉత్తరప్రాంతంలోని మేడ్చల్, శామీర్ పేట సహా చుట్టుపక్కల ప్రాంతాలవారికి ప్రయాణ సౌలభ్యం లభించనుంది.
ఎక్కడ నుంచి ఎక్కడ దాకా..
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు.. హైదరాబాద్ నార్త్(ఉత్తర) ప్రాంతంలోని ప్యారడైజ్- మేడ్చల్ మధ్య 23 కిలో మీటర్ల మేరకు.. ఈ మెట్రో విస్తరించనుంది. అదేవిధంగా శామీర్‌పేట-జేబీఎస్‌ల మధ్య 22 కిలో మీటర్ల మేరకు కూడా.. మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టులను ‘మెట్రో రైల్ ఫేజ్-2-బీ’లో భాగంగా చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అనేక మంది దీనిపై విజ్ఞప్తులు చేశారని.. తనకు కూడా అవగాహన ఉందని పేర్కొన్నారు.
ఏయే లైన్లు..
ఈ రెండు మెట్రో కారిడార్‌లు అందుబాటులోకి వస్తే.. ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవడంతోపాటు.. సమయం కూడా కలిసి రానుంది. ప్రధానంగా మేడ్చల్, శామిర్‌పేటల మధ్య ట్రాఫిక్ సమస్య తగ్గిపోయే అవకాశం ఉంది. దీనిని కూడా మెట్రో రైల్ ప్రాజెక్టు ఏలో భాగంగానే కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపటనున్నారు. ప్యారడైజ్ నుంచి సుచిత్ర, బోయిన్పల్లి, తాడ్ బండ్, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు ఒక లైన్ వెళ్తుంది. ఇది 23 కిలో మీటర్లు ఉండనుంది. మరొకటి.. జేబీఎస్ స్టేషన్ నుంచి విక్రమ్‌గిరి, కార్ఖానా, తిరుమల గిరి, అల్వాల్, బొల్లారంమీదుగా శామీర్ పేట వరకు 22 కిలో మీటర్ల వరకు ఈ లైన్ అందుబాటులోకి రానుంది.