“ఇవ‌న్నీ జ‌రుగుతుంటాయండీ.. పోలీసులంతే”… అన్నారు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ పోలీసుల ప‌నితీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారుల తీరు స‌రిగాలేద‌ని చెప్పారు. వారి స్పంద‌న బాగుంటే.. మెరుగైన ఫ‌లితం రాబ‌ట్టుకోవ‌చ్చ‌న్నారు. కానీ, అలా లేద‌ని చెప్పారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పోలీసుల ప‌నితీరు, ఉద్యోగుల అవినీతి, వారి సెల‌వులు వంటి విష‌యాల‌పై త‌న మ‌న‌సులో మాట‌ను మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌పై మాట్లాడుతూ.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

“కాకినాడలో ఇటీవ‌ల ఓ ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌మాదం జ‌రిగి చ‌నిపోయారు. వీరిలో ఒక‌రు బ్రెయిన్ డెడ్ అయ్యారు. అయితే.. కేసు న‌మోదు చేయలేద‌ని.. ఆ యువ‌కుల కుటుంబ స‌భ్యులు చెప్పారు. ఈ విష‌యం నాదాకా వ‌చ్చిన త‌ర్వాత‌.. మా కార్యాల‌య అధికారిని.. జిల్లా ఎస్పీతో మాట్లాడ‌మ‌ని చెప్పాను. దీంతో ఆయ‌న ఎస్పీతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌..”ఇలాంటి వ‌న్నీ జ‌రుగుతుంటాయండి. పోలీసులంతే” అని లైట్‌గా వ్యాఖ్యానించారు. ఇలా అయితే.. పోలీసుల పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఎలా క‌లుగుతుంది?” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు.

అవినీతి పెచ్చుపెరిగిపోయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. “అధికారుల ప‌నితీరును బేరీజు వేసే వ్య‌వ‌స్థ‌ను వైసీపీ నాశ‌నం చేసిం ది. దీంతో ఎవ‌రి ఇష్టం వారిదే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఇది అవినీతికి కూడా దారి తీసింది. అస‌లు అవినీతి, లంచాలు అనేవి త‌మ హ‌క్కుగా అధికారులు భావించే ప‌రిస్థితి కూడా ఏర్పడింది” అని ప‌వ‌న్ అన్నారు. ఈ ప‌రిస్థితిని స‌మూలంగా మార్చాలంటే.. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లే బెస్ట్ అని వ్యాఖ్యానించారు. జిల్లాల‌కు వెళ్లి అక్క‌డే తిష్ఠ‌వేయ‌డం ద్వారా.. ప‌రిస్థితిలో మార్పు తీసుకురావ‌చ్చ‌న్నారు. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. తానే తొలుత జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతాన‌ని చెప్పారు.

ఇక‌, ఉద్యోగుల సెల‌వుల విష‌యంపైనా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వారానికి రెండు రోజుల పాటు సెల‌వులు కావాల‌ని అధికారులు కొరుకుంటున్నార‌ని చెప్పారు. అయితే.. ఐదురోజుల పాటు స‌క్ర‌మంగా అలుపెరుగ‌ని విధంగా ప‌నిచేస్తే.. చివ‌రి రెండు రోజులు శ‌ని, ఆదివారాలు సెల‌వు తీసుకోవ‌డం త‌ప్పుకాద‌ని.. కానీ, అలా చేయ‌డం లేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌మ‌స్య‌లు పెరుగుతున్న‌ట్టు చెప్పారు. అందుకే చంద్ర‌బాబు అధికారుల‌కు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ ఇస్తున్నార‌ని చెప్పారు. అయినా.. వారిలో మార్పు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని.. వారిలో మార్పు వ‌స్తే.. వారానికి రెండు రోజ‌లు సెల‌వు తీసుకున్నా… ప‌నులు జ‌రుగుతాయ‌ని వ్యాఖ్యానించారు.