తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(టీవీకే) అనే పార్టీని స్థాపించిన విజయ్…వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పర్యటనలు చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇకపై సినిమాల్లో నటించనని, పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించిన విజయ్ తమిళనాట రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని టీవీకే అధినేత విజయ్ కలిశారు.
తమిళనాడులో శాంతి భద్రతలు పరిరక్షించాలని గవర్నర్ కు విజయ్ ఓ పిటిషన్ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రత కోసం తగు చర్యలు తీసుకోవాలని విజయ్ ఆ పిటిషన్ లో కోరారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థిని అత్యాచార ఘటనపై ఇప్పటికే లేఖ విడుదల చేసిన విజయ్.. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, శాంతి భద్రతల వైఫల్యం గురించి గవర్నర్ దగ్గర ప్రస్తావించారు. డీఎంకే ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేదని అన్నారు.
సీఎం స్టాలిన్ శాంతి భద్రతల విషయంలో విఫలమయ్యారని విజయ్ లేఖ విడుదల చేసిన వెంటనే గవర్నర్ ను కలవడం తమిళనాట రాజకీయ రచ్చ రేపింది. అంతేకాకుండా, ఇటీవల తమిళనాడును కుదిపేసిన ఫెన్గల్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందలేదని గవర్నర్ దృష్టికి విజయ్ తీసుకువచ్చారు.
తుపాను బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేలా చూడాలని గవర్నర్ కు విజయ్ విజ్ఞప్తి చేశారు. మరి, విజయ్ కు డీఎంకే నేతల కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates