సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఘటనపై, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అల్లు అర్జున్ ఇష్యూపై పవన్ కళ్యాణ్ స్పందించారని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
అయితే, పవన్ మాట్లాడిన వీడియో మాత్రం ఎక్కడా సర్క్యులేట్ కావడం లేదు. గోటితో పోయే అంశాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని పవన్ అన్నారని తెలుస్తోంది. ఆ ఘటనలో రేవతి మరణం తనను కలచి వేసిందని, అయితే, అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉండాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారట. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ముందే చెప్పి ఉండాల్సిందని అన్నారట.
ఆ ఘటనలో హీరో అల్లు అర్జున్ ను ఒంటరిని చేశారని, అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందని పవన్ చెప్పారట. రేవతి చనిపోయారన్న ఆవేదన అల్లు అర్జున్ లో ఉందని, అల్లు అర్జున్ ఒక్కరినే దోషిగా నిలబెట్టడం సరికాదని పవన్ అన్నారట. గతంలో చిరంజీవి కూడా ముసుగు వేసుకొని అభిమానులతో కలిసి థియేటర్లో సినిమా చూసేవారని పవన్ గుర్తు చేసుకున్నారట. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, వెనక ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ, చట్టం అందరికీ సమానం అని తాను నమ్ముతానని పవన్ అన్నారట.
థియేటర్ సిబ్బంది, యాజమాన్యం అల్లు అర్జున్ కు ముందే పరిస్థితి వివరించి ఉండాల్సిందని, థియేటర్లో ఆయన కూర్చున్న తర్వాత అయినా సరే చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్లి ఉండాల్సిదని పవన్ అభిప్రాయపడ్డారట. ప్రజల భద్రత గురించి పోలీసులు ఆలోచిస్తారని, వారిని తాను తప్పుబట్టనని చెప్పారట. సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయారని అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారనడం సరికాదని పవన్ అన్నారట.
రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని, కింది స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు అంచెలంచెలుగా ఎదిగారని పవన్ కితాబిచ్చారట. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు విషయంలో వైసీపీ నేతల్లాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించలేదని పవన్ చెప్పారట. బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు ఆయన అనేక అవకాశాలిచ్చారని పవన్ గుర్తు చేశారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates