తెలంగాణ నేత‌ల ‘టీటీడీ రిక‌మండేష‌న్ల‌’కు ఓకే: చంద్ర‌బాబు

తిరుమ‌ల తిరుప‌తి శ్రీవారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఇటీవ‌ల కాలంలో తెలంగాణ నేత‌ల నుంచి ప్ర‌ధాన డిమాండ్ వినిపిస్తోంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కూడా.. అంద‌రూ త‌మ సిఫార్సు లేఖ‌ల‌ను అనుమ‌తించాల‌ని కోరుతున్నారు. తిరుమ‌ల‌కు వ‌చ్చే తెలంగాణ భ‌క్తుల‌కు సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లోనూ ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప‌ట్టుబడుతున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి కొండా సురేఖ స‌హా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిఫార్సు లేఖల వ్య‌వ‌హారంపై త‌ర‌చుగా కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రుల నుంచి వ‌చ్చే సిఫార్సు లేఖ‌ల‌ను అనుమ‌తించాల‌ని సీఎం ఆదేశించారు. అయితే.. ఎవ‌రి నుంచి వ‌చ్చినా.. ఎన్ని వ‌చ్చినా.. వారానికి నాలుగు సిఫార్సు లేఖ‌ల మేర‌కే ద‌ర్శ‌నాలు క‌ల్పించాల‌ని తేల్చిచెప్పారు. వీటిలోనూ రెండు బ్రేక్ ద‌ర్శ‌నాలు, రెండు రూ.300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌కు ప‌రిమితం కావాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

ఈ మేర‌కు టీటీడీ పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడుకు చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తి స‌చివాల‌యంలో ఉన్న సీఎం చంద్ర‌బాబును బీఆర్ నాయుడు సోమ‌వారం మ‌ధ్యాహ్నం క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ నేత‌ల సిఫార్సు లేఖ‌ల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించారు. వారానికి నాలుగు లేఖ‌ల‌ను మాత్ర‌మే అనుమ‌తించాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం తేల్చి చెప్పారు. అదేస‌మ‌యంలో మాజీ ప్ర‌తినిధులు ఇచ్చే సిఫార్సు లేఖ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దీంతో తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల డిమాండ్ నెరవేరిన‌ట్ట‌యింది.