ప‌వ‌న్ ఎఫెక్ట్‌.. స్టెల్లా నుంచి బియ్యాన్ని దించేశారు!

కాకినాడ సీపోర్టు నుంచి రేష‌న్ బియ్యం అక్ర‌మంగా త‌ర‌లిపోతోందంటూ.. నెల రోజుల కిందట ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ క్ర‌మంలోనే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. నేరుగా కాకినాడ పోర్టుకు వెళ్లి ప‌రిశీలించారు. నేరుగా 10 మైళ్ల దూరంలో స‌ముద్రంలో నిలిపి వుంచిన విదేశీ నౌక స్టెల్లా ఎల్‌ పనామాను చేరుకుని.. బియ్యాన్ని ప‌రీక్షించారు. అనుమానం వ‌చ్చిన ఆయ‌న నౌక‌ను నిలిపి ఉంచాల‌ని పేర్కొంటూ.. సీజ్ ది షిప్ అని వ్యాఖ్యానించారు. కానీ, కేంద్రం దీనికి అనుమ‌తించ‌లేదు. ఆ త‌ర్వాత‌.. కొన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. దీంతో నౌక‌ను ఆగిన చోటే ఆపి ఉంచారు.

విదేశీ నౌక‌ల రాక‌పోక‌ల‌పై కేంద్రానికే అజ‌మాయిషీ, అధికారాలు కూడా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం స‌ద‌రు షిప్పును నిలువ‌రించేందుకు అనుమ‌తులు లేవ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సందేశం పంపింది. దీంతో కొన్ని రోజుల పాటు నౌక‌ను ఇక్క‌డే ఉంచేలా అనుమ‌తులు తెచ్చుకున్న అధికారులు.. స్టెల్లా నౌక‌లోకి ఎక్కించిన రేష‌న్ బియ్యాన్ని అతి క‌ష్టం మీద ఒడ్డుకు చేర్చారు. సుమారు.. 1320 టన్నుల రేషన్‌ బియ్యం ఈ నౌక‌లో ఉన్నాయ‌ని.. దీనిని వెన‌క్కి తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. తుఫాను హెచ్చ‌రిక‌లు, స‌ముద్రం ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుని ఎట్ట‌కేల‌కు.. షిప్పు నుంచి బియ్యాన్ని వెన‌క్కి తీసుకువ‌చ్చారు.

ఈ బియ్యం ర‌వాణాపై పూర్తిస్థాయిలో విచార‌ణ చేసి నిందితుల‌ను ప‌ట్టుకుంటారు. ఇదిలావుంటే.. జ‌న‌వ‌రి 4న స్టెల్లా నౌక‌.. కాకినాడ తీరం నుంచి బ‌య‌లు దేర‌నుంది. ఎగుమతికి సిద్ధంగా ఉన్న 19,785 టన్నుల బియ్యాన్ని ఈ నౌక తీసుకుపోనుంద‌ని అధికారులు తెలిపారు. వాస్త‌వానికి ఈ నౌక కాకినాడ తీరానికి చేరుకుని నెల రోజులు అవుతోంది. లోడింగ్ ప్రక్రియ పూర్త‌య్యాక అనూహ్యంగా ఈ నౌక నుంచి రేష‌న్ బియ్యం త‌ర‌లి పోతున్నాయ‌ని తెలియ‌డంతో తొలుత క‌లెక్ట‌ర్ షాన్‌మోహ‌న్ సాహ‌సం చేసి.. మ‌రీ స‌ముద్రంలో ప్ర‌యాణించి నౌక‌ను ప‌రిశీలించారు. ఆయ‌న ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డ నుంచి వ‌స్తూ వ‌స్తూనే నేరుగా కాకినాడ‌లో ల్యాండ్ అయి.. నౌక‌ను ప‌రిశీలించిన విష‌యం తెలిసిందే.

ఎక్క‌డ నుంచి ఎక్క‌డిదాకా..

కాకినాడ పోర్టు నుంచి స్టెల్లా నౌక‌.. పశ్చిమ ఆఫ్రికాలోని కోటోనౌ పోర్టుకు చేరాల్సి ఉంది. దీనికి గాను వాతావ‌ర‌ణం అనుకూలిస్తే.. 26 రోజులు ప‌ట్ట‌నుంది. నిజానికి ఇప్ప‌టికే ఈ నౌక వెళ్లాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో నిలిపి వేసిన కార‌ణంగా ఆల‌స్య‌మైంద‌ని పోర్టు అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం లోడింగ్ ప్ర‌క్రియ పూర్త‌య్యాక‌.. వ‌చ్చే నెల 4 న ఈ నౌక ఆఫ్రికాకు బ‌య‌లు దేర‌నుందని పేర్కొన్నారు.