పవర్ స్టార్ వేరు – డిప్యూటీ సీఎం వేరు : ఫ్యాన్స్ అర్ధం చేసుకోవాలి!

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఈ ఇద్దరూ ఒక్కటేనా? పవన్ అభిమానులు అయితే ఈ ఇద్దరూ ఒక్కటే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం అలా అనుకోవడం లేదన్న విషయం ఫ్యాన్స్ గ్రహించాలి. సినీ హీరో పవన్ కల్యాణ్ ను, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ ను వేరు వేరుగా చూడాలని పవన్ ఇటీవల కాలంలో చాలాసార్లు చెప్పారు. అయినా సరే కొందరు అభిమానులు మాత్రం పవన్ రాజకీయ పర్యటనల సమయంలో సినిమా ఈవెంట్ లలో మాదిరిగా కేకలు పెడుతున్నారు.

అలా చేయొద్దని పవన్ సున్నితంగా అభిమానులను హెచ్చరించినా..చిరుకోపంతో నచ్చజెప్పాలని చూసినా వారు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. వారం రోజుల క్రితం మన్యం జిల్లాలో రోడ్ల శంకు స్థాపనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ ను..‘ఓజీ’లో పవన్ కల్యాణ్ లా ఫీల్ అయ్యి అరుపులు, కేకలు పెట్టారు. వద్దని పవన్ వారించినా వినలేదు. ఇక, తాజాగా కడపలో పర్యటిస్తున్న పవన్ ను చూసి ఓజీ ఓజీ అంటూ అభిమానులు కేకలు వేశారు.

వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ ఎంపీడీవోను పరామర్శించిన తర్వాత మీడియాతో పవన్ సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో వారు ఈ కేకలు వేయడంతో పవన్ అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఒక ప్రభుత్వ అధికారిపై పట్టపగలు అమానుషంగా వైసీపీ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ పవన్ మాట్లాడుతుంటే ఓజీ ఓజీ అంటూ అభిమాలు అరవడంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఏంటయ్యా మీరు…ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియకపోతే ఎలా?’’ అంటూ పవన్ కాస్త అసహనానికి గురి అవ్వాల్సి వచ్చింది. చాలాకాలంగా పవన్ సినిమా ‘ఓజీ’ కోసం ఎదురు చూస్తున్న ఆ ఫ్యాన్స్ ఉత్సాహం సబబే అనిపించినా… ఆ అభిమానం చూపిస్తున్న స్థలం మాత్రం సరైనది కాదని పవన్ అభిప్రాయం. డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ పాల్గొంటున్న కార్యక్రమాల్లో ఓజీ అంటూ కేకలు వేస్తే ఆయనకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ కేకలు వేస్తున్న ఫ్యాన్స్ ఒకసారి ఆలోచించాలి.

ఇక, ఓ పక్క గాయపడ్డ అధికారిని పవన్ పరామర్శిస్తుంటే… మరోపక్క సినిమాకు సంబంధించిన నినాదాలు చేయడం ఎంవరకు సమంజసం అని అభిమానులు తర్కంతో ప్రశ్నించుకోవాలి. ఇలా చేయడం వల్ల పవన్ రాజకీయ, సినీ ప్రత్యర్థులకు కొందరు పవన్ అభిమానులు స్వయంగా ట్రోలింగ్ మెటీరియల్ ఇచ్చినట్లే అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ ‘ఓజీ’ ప్రమోషన్ ఈవెంట్ల వరకు ఈ ఎనర్జీని ఆ ఫ్యాన్స్ దాచిపెట్టుకుంటే పవన్ ఫుల్ ‘ఖుషి’ అవుతారనడంలో సందేహం లేదు.