మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి… మెమోరియల్ పై కేంద్రం క్లారిటీ

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అధికారికంగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ దిగ్గజ నేతకు పలువురు ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ పాల్గొన్నారు.

వీరితోపాటు, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, భూటాన్ రాజు వాంగ్చుక్, త్రివిధ దళాధిపతులతో పాటు పలువురు రాజకీయ నేతలు మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అంతకుముందు, మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు భారీ జన సందోహం మధ్య జరిగింది. ఈ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ పాడెను రాహుల్ గాంధీ మోశారు. కాగా, మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం స్థలం కేటాయింపు వ్యవహారంపై సస్పెన్స్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దహన సంస్కారాలు జరిగిన చోటే మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది.

అయితే, ఆ విషయంపై కొందరు బీజేపీ నేతలు భిన్న వ్యాఖ్యలు చేశారు. దీంతో, దేశపు మొదటి సిక్కు ప్రధాని ఉద్దేశపూర్వకంగా బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ వివాదంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా క్లారిటీనిచ్చింది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించింది.

మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుంచి అభ్యర్థన వచ్చిందని తెలిపింది. దీనిపై కేబినెట్ భేటీలో చర్చించారని, స్థలం కేటాయిస్తున్నట్లు ఖర్గే మరియు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు అమిత్ షా తెలిపారని వెల్లడించింది. అయితే, ప్రస్తుతానికి మన్మోహన్ సింగ్ దహన సంస్కారాలు, ఇతర లాంఛనాలు పూర్తవుతాయని చెప్పింది. స్మారకం ఏర్పాటు చేయడానికి ముందు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దానికి స్థలం కేటాయించాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.