మోడీ కోసం బాబు: ఎన్ని భ‌రిస్తున్నారంటే.. !

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోడీతో ఉన్న గ్యాప్‌ను దాదాపు త‌గ్గించుకునే దిశ‌గా సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ ఏం చెప్పినా.. చంద్ర‌బాబు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అదానీతో ఉన్న సౌర విద్యుత్ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని అనుకున్నా.. మోడీ అనుచ‌రుడు కావ‌డంతో అదానీతో స‌ఖ్య‌త లేక‌పోయినా.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నా.. స‌ద‌రు ఒప్పందాల‌ను మాత్రం చంద్ర‌బాబు ర‌ద్దు చేసుకోలేక పోతున్నారు.

అదేవిధంగా స్మార్టు మీట‌ర్ల విష‌యంలోనూ జ‌గ‌న్ చేసిన ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోలేక పోతున్నారు. దీనికి సంబంధించిన భారాలు ప్ర‌జ‌ల‌పై ప‌డుతున్నాయ‌ని చంద్ర‌బాబు చెబుతున్నా.. మోడీ కోసం.. ఈ ఒప్పందాన్ని కూడా భ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ, మ‌న‌సులో మాత్రం ర‌ద్దు చేసుకోవాల‌నే ఉంది. అయితే.. ఈ స్మార్టు మీట‌ర్లు కూడా.. అదానీకి చెందిన సంస్థ‌వే కావ‌డంతో చంద్ర‌బాబు సాహ‌సం చేయ‌లేక పోతున్నారు. ఇలా.. అనేక విష‌యాల్లో మోడీతో చెలిమి కోసం చంద్ర‌బాబు త‌పిస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు త‌న భుజాల‌పైకి ఎత్తుకున్నారు. అదే జ‌మిలి ఎన్నిక‌లు. వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్ పేరుతో కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన బిల్లు ప్ర‌స్తుతం లోక్‌స‌భ‌లో ఉంది. దీనిపై సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీని ఏర్పాటు చేశారు. అయితే.. దీనిపై క‌మిటీ రిపోర్టు వ‌చ్చేందుకు మూడు మాసాల వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. ఇంత‌లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు.. ఇత‌ర పార్టీల‌ను ఒప్పించాల్సి ఉంది.

నిజానికి త‌మిళ‌నాడు, క‌ర్ణాక‌ట‌, తెలంగాణ‌, ఒడిశాలోని ప్ర‌తిప‌క్షం వంటివి జ‌మిలికి ఒప్పుకోవ‌డం లేదు. అయితే.. వీరంతా కూడా.. చంద్ర‌బాబుకు స‌న్నిహితులు. ఒక్క క‌ర్ణాట‌క‌లో సిద్ద‌రామ‌య్య మిన‌హా.. మిగిలిన రాష్ట్రాల నేత‌లు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులుకూడా చంద్ర‌బాబుకు మిత్రులే. ఈ క్ర‌మంలో వారిని ఒప్పించే బాధ్య‌త‌ల‌ను మోడీ ఇప్పుడు చంద్ర‌బాబు భుజాల‌పై పెట్టిన‌ట్టు జాతీయ మీడియా చెబుతోంది. ఇటీవ‌ల డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబుతో ఈ విష‌యం మోడీ చ‌ర్చించార‌ని.. కొంత బాధ్య‌త తీసుకోవాల‌నికోర‌న‌ట్టు స‌మాచారం. దీనికి చంద్ర‌బాబు కూడా ఓకే చెప్పార‌ని తెలిసింది. దీంతో జ‌మిలి బాధ్య‌త‌ల్లో కీల‌క పాత్ర ఇప్పుడు చంద్ర‌బాబు పై ప‌డింది. మ‌రి ఎలా సాధిస్తారో చూడాలి.