‘విజ‌న్-2020’ రూప‌శిల్పి బాబు.. కార్య‌శిల్పి మ‌న్మోహ‌న్‌.. !

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకువ‌చ్చిన ‘విజ‌న్‌-2020’ – అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దీనికి ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. భ‌విష్య‌త్తు మార్గ‌నిర్దేశనం చేస్తూ.. చంద్ర‌బాబు వేసిన పునాదులు ప్ర‌స్తుతం తెలంగాణ‌కు వ‌రంగా మారాయి. జీనోం వ్యాలీ నుంచి సైబ‌రాబాద్ వ‌ర‌కు అనేక విధానాలు తీసుకువ‌చ్చారు. అభివృద్ధి బాట ప‌ట్టించారు. ఆర్థికంగా కొత్త పుంత‌లు తొక్కించారు.

అయితే.. ఈ విజ‌న్‌-2020 ఆలోచ‌న వెనుక రూప‌శిల్పి చంద్ర‌బాబే అయినా.. కార్య‌శిల్పి మాత్రం డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్‌సింగ్. ఈ విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబే చెప్పుకొచ్చారు. అప్ప‌టికి నిజంగా మ‌న్మోహన్ సింగ్ ప్ర‌ధానిగా లేరు. దేశ‌ ఆర్థిక మంత్రిగా మాత్ర‌మే ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే మ‌న్మోహ‌న్ నోటి నుంచి వ‌చ్చిన ‘విజ‌న్‌-2020’ని చంద్ర‌బాబు అందిపుచ్చుకున్నారు. వాస్త‌వానికి ఆర్థిక వేత్త‌గా కేంద్రం అనుస‌రించాల్సిన మార్గాన్ని అప్ప‌ట్లో మ‌న్మోహ‌న్ చెప్పుకొచ్చారు.

దీనిని కేంద్రం స‌హా.. ఇత‌ర రాష్ట్రాలు అనుస‌రిస్తే బాగుంటుంద‌ని సూచించారు. కానీ, ఏ రాష్ట్రమూ అంది పుచ్చుకునే సాహ‌సం చేయ‌లేక పోయాయి. ఇలాంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు అందిపుచ్చుకున్నారు. త‌న‌దైన ఆలోచ‌న‌ల‌ను జోడించారు. విజ‌న్‌-2020కి రూపం తీసుకువ‌చ్చారు. ఫ‌లితంగా భవిష్య‌త్తు ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత‌.. ప‌లు సంద‌ర్భాల్లో మ‌న్మోహ‌న్‌ను క‌లుసుకుని.. ఆయ‌న నుంచి కూడా స‌ల‌హాలు తీసుకున్నారు.

ఇలా రూపొందించిన విజ‌న్‌-2020 ద్వారా సెల్‌ఫోన్ నుంచి కంప్యూట‌ర్ వ‌ర‌కు.. అనేక రూపాల్లో ఉమ్మ‌డి ఏపీని అభివృద్ధి బాట ప‌ట్టించారు చంద్ర‌బాబు. తొలుత దీనిని గేలి చేసిన వారు త‌ర్వాత‌.. ఆయ‌న చూపిన బాట‌లోనే న‌డిచారు. ప్ర‌తి ఒక్క అంశాన్నీ.. సూక్ష్మంగా ఆలోచించ‌డం.. భ‌విష్య‌త్తును ముందుగానే ఊహించి.. పెట్టుబ‌డులు ఆహ్వానించ‌డం.. ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డం వంటివి చంద్ర‌బాబుకు త‌ర్వాత కాలంలో ఎంతో పేరును తీసుకువ‌చ్చాయి. ఇప్ప‌టికీ చంద్ర‌బాబుకు విజ‌న్‌-బాబుగా ఉత్త‌రాదిలో పేరును సార్థ‌కం చేశాయి.