అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా ఉంటాయి. ఒక్కొక్క‌సారి వాటిని ప‌క్క‌న కూడా పెట్టేస్తారు. కానీ, త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై.. తాజాగా భీష‌ణ ప్ర‌తిజ్ఞే చేశారు. ప‌ట్టుమ‌ని 10 శాతం ఓటు బ్యాంకు కూడా లేని రాష్ట్రంలో ఆయ‌న బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు తాను చెప్పులు వేసుకునేది లేద‌ని సంచ‌ల‌న ప్ర‌తిజ్ఞ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రీ అన్నామ‌లై?

వాస్త‌వానికి ఐపీఎస్ అధికారి అయిన అన్నామ‌లై.. క‌ర్ణాట‌క‌లో ఎస్పీగా ప‌నిచేశారు. అయితే.. అక్క‌డే ఆయన బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. ఈ క్ర‌మంలోనే సొంత రాష్ట్రానికి వ‌చ్చేశారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నికలు ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే సాగాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ‌డంతో ఆయ‌న‌కు రాజ‌కీయంగా బీజేపీలో తిరుగులేకుండా పోయింది. ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా.. వారిని ప‌క్క‌న పెట్టి మ‌రీ ఆయ‌న‌ను రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను చేశారు.

ప్ర‌తిజ్ఞ ఎందుకు?

త‌ర‌చుగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. మీడియాలో ఉండే అన్నామ‌లై.. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల్లోని లోపాల‌ను బాగానే ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా అన్నా యూనివ‌ర్సిటీలో ఓ విద్యార్థినిపై.. అత్యాచారం జ‌రిగింది. దీనికి సంబంధించి డీఎంకే స‌ర్కారుపై ముప్పేట దాడి జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే అన్నామ‌లై.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు న‌శించాయ‌ని.. ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌ని.. డీఎంకే స‌ర్కారు అంత‌మై పోవాల‌నికూడా అన్నామ‌లై చెబుతున్నారు. డీఎంకే స‌ర్కారును గ‌ద్దె దింపి.. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే వ‌ర‌కు తాను చెప్పులు ధ‌రించే ది లేద‌ని ఆయ‌న భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌ను నిర‌సిస్తూ.. కొర‌డా దెబ్బ‌లు తింటాన‌ని.. మురుగ‌న్‌(కుమార‌స్వామి) ఆల‌యాల‌ను ద‌ర్శిస్తాన‌ని 48 గంట‌ల పాటు ఉప‌వాస దీక్ష చేస్తాన‌ని కూడా.. చెప్పుకొచ్చారు. మ‌రి ఇవి ఆయ‌న‌కు, బీజేపీకి ఏ మేర‌కు మైలేజీ తెస్తాయో చూడాలి.