జ‌న‌సేనాని దూకుడు.. కేంద్రం ఫిదా!

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా.. ప‌నితీరు విష‌యంలో మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌.. నిధుల స‌మీక‌ర‌ణ‌.. ఈ రెండు విష‌యాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా నిక్క‌చ్చిగా ఉంటున్నారు. చంద్ర‌బాబు సైన్యంలో జ‌న‌సేనాని డిఫ‌రెంట్ అనే టాక్ వ‌చ్చేలా ఆయ‌న చేసుకున్నారు. పంచాయ‌తీ రాజ్ గ్రామీణ అభివృద్ది శాఖల‌ను అత్యంత కీల‌కంగా భావిస్తున్న ప‌వ‌న్ .. వాటిలో అభివృద్దికి పెద్ద‌పీట వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌పైనే ఆధార‌ప‌డ‌కుండా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ప‌క్కాగా తెచ్చుకుంటున్నారు. ఇది రాష్ట్రంపై భారం ప‌డ‌కుండా.. ప‌నులు సులువుగా చేసుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డేలా చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల‌ను ప్ర‌తి రూపాయి తెచ్చుకోవ‌డం లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌క్సెస్ అవుతున్నారు. వీటి ద్వారా.. జ‌ల జీవ‌న్ మిష‌న్‌కు కేటాయించిన నిధులు.. ఉపాధి హామీ ప‌నుల‌కు కేటాయించిన నిధుల‌ను విడ‌దీసి.. వేటిక‌వే వినియోగిస్తున్నారు.

త‌ద్వారా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రూపు రేఖ‌లు ఇప్పుడు మారే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. ర‌హ‌దారుల‌ను బాగు చేయాల‌న్న సంక‌ల్పంతో ప‌వ‌న్ ముందుకు సాగుతున్నారు. ర‌హ‌దారుల నిర్మాణ‌మే కాదు.. వాటి నిర్మాణ తీరును, నాణ్యత‌ను కూడా ఆయ‌న ప‌క్కాగా ప‌రిశీల‌న చేస్తున్నారు. దీంతో ప‌నుల్లో నాణ్య‌త పెర‌గ‌డంతోపాటు అధికారుల్లో జవాబు దారీ త‌నం కూడా పెరిగింది.

డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ ప‌నితీరుకు మెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం వ‌డివ‌డిగా నిధుల‌ను విడుద‌ల చేస్తుండం గ‌మ‌నార్హం. తాజాగా గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ ను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ గ్రాంట్స్ కింద 446.49 కోట్ల రూపాయ‌ల‌ను నేరుగా ప‌వ‌న్ నేతృత్వం వ‌హిస్తున్న పంచాయ‌తీ రాజ్ ఖాతాకు కేంద్రం బ‌దిలీ చేసింది. రాష్ట్రంలోని 1397 గ్రామపంచాయతీలు, 650 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్ లు అభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. మొత్తానికి ప‌గ్గాలు చేప‌ట్టిన ఆరు మాసాల్లోనే ప‌వ‌న్ ఇంత పెద్ద మొత్తం సాధించ‌డం విశేషం.