విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మక్కల్ నీది మయ్యం పేరుతో ఆయన పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే.. తమిళనాడు ఎన్నికల్లో పోటీకి దిగి..కుదిరితే అధికారం.. లేదంటే.. అధికారాన్ని శాసించగల రేంజ్లో సీట్లను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన వేస్తున్న అడుగులను పరిశీలిస్తున్న నిపుణులు.. ఇవేవో.. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయోగాల మాదిరిగా ఉన్నాయే అని చర్చించుకుంటున్నారు. దీంతో అసలు కమల్ హాసన్ చేస్తున్న ప్రయోగాలు ఏంటనేది పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు వచ్చింది.
2018లో తెలంగాణ ఎన్నికలు జరిగాయి. అక్కడ టీడీపీకి పెద్దగా పట్టులేదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. కేసీఆర్‌పై ఉన్న రాజకీయ వ్యూహంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. అనూహ్యమైన పొత్తులకు తెరదీశారు. బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపారు. ఈ వ్యూహం వికటించిందనుకోండి. అయితే, ఎటొచ్చీ.. బాబుకు పెద్దగా నష్టం జరగకపోయినా.. ఆయనతో కలిసి అడుగులు వేసిన కాంగ్రెస్ తీవ్రంగా నష్టం పోయిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తమిళనాడులో.. కమల్ కూడా బాబు మాదిరిగా.. వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నా చితకాపార్టీలను పోగేసి తృతీయ కూటమి ఏర్పాటు చేయాలని కమల్ నిర్ణయించుకున్నట్టు తమిళ పత్రికలు కూడా చెబుతున్నాయి.
ఇది టీడీపీ చేసిన ప్రయోగం మాదిరే ఉందని కూడా పేర్కొనడం గమనార్హం. నిజానికి తొలిసారి పోటీ చేస్తున్న పార్టీ సొంతంగా పోటీకి దిగడమో.. లేదా బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవడమో చేయాలి. కానీ, కమల్ మాత్రం.. తృతీయ కూటమి అంటూ.. తన చిరకాల మిత్రుడు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయ పార్టీతో(ఇంకా ప్రారంభమే కాలేదు) పొత్తుపెట్టుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. అదేసమయంలో నటుడు, వివాదాస్పద రాజకీయ నాయకుడిగా పేరున్న విజయకాంత్ నాయకత్వంలోని డీఎండీకేను కూడా తనతో కలుపుకొని ముందుకు సాగాలని స్కెచ్ వేసుకున్నారు. ఇక, ఆలూలేదు.. చూలూ లేదు.. అన్నట్టుగా.. అసెంబ్లీ ఎన్నికల్లో 150 నియోజకవర్గాలను తన దగ్గరే ఉంచుకుంటారట.
మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వాలని ఇప్పటి నుంచే షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. అయితే, నిజానికి ఈ తృతీయ కూటముల ప్రయోగం.. తమిళనాడుకు కొత్తకాదు. రాష్ట్రంలో దిగ్గజ నాయకులుగా పేరున్న వారు సైతం పలుమార్లు తృతీయ కూటములు ఏర్పాటు చేసి.. ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు కమల్ కూడా అదే బాటలో నడిస్తే.. ఆయన ఆశించింది జరగకపోగా.. ఆదిలోనే ఘోర అవమానం భరించాల్సి ఉంటుందనేది విశ్లేషకుల మాట.