సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తీవ్ర విమర్శలు, ఆరోపణలే చేశారు. దానికి బదులుగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు ఖండించాడు. ఐతే ప్రెస్ మీట్లో బన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలు, పోలీసులకు ఏమాత్రం రుచించలేదు. నిన్న అతడిపై గట్టిగానే ఎదురు దాడి జరిగింది. ఓవైపు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ వ్యాఖ్యలను ఖండిస్తూ అతడికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను బయటపెట్టారు.
మరోవైపు మంత్రులు, నేతలు బన్నీ తీరును తప్పుబడుతూ ఉన్నారు. ఈ కేసు మీద మొదట్నుంచి మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బన్నీ ప్రెస్ మీట్ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఒక ప్రాణం పోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి సూపర్ స్టార్ అయితే ఏంటి” అంటూ ఆయన బన్నీ మీద విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదని.. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు కోమటిరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. తొక్కిసలాటపై అసెంబ్లీ తన ఇమేజ్ దెబ్బతీశారని అల్లు అర్జున్ అంటున్నాడని.. . కానీ సీఎం వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదని.. ఆ రోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించి చెప్పారని ఆయనన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు వద్దని చెప్పినా.. అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. అల్లు అర్జున్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని..ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన వెళ్లి కనీసం బాధితులను పరామర్శించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్ట్ సమయంలో పోలీసులు ఎంతో సహనంతో వ్యవహరించారని ఆయనన్నారు.. ఒక వ్యక్తి ప్రాణం పోవడం మామూలు విషయం కాదని.. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయితే ఏంటీ సూపర్ స్టార్ అయితే ఏంటి? చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి వ్యాఖ్యానించారు. స్టార్లకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండవని.. తప్పు చేస్తే నటుడికైనా.. ఎమ్మెల్యేకైనా శిక్ష తప్పదని ఆయనన్నారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తే కేటీఆర్, హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. వారికి మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని మంత్రి ఘాటుగా విమర్శించారు. పుష్ప-2కు 2 నుంచి 3వేల కోట్లు వచ్చాయంటున్నారని… రేవతి కుటుంబానికి రూ. 20 కోట్లు ఇస్తే ఏంటని ఆయన ప్రశ్నించారు.