చాగంటి కోటేశ్వరరావుకు మరో కీలక బాధ్యత

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు నైతిక విలువల సలహాదారుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమైన అనంతరం నైతిక విలువల కోసం విద్యార్థులతో ఆయన జరుపుతున్న కృషికి మరింత ప్రాధాన్యం పెరిగింది. తాజాగా ఏపీ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావుకు మరో కీలక బాధ్యతను అప్పగించింది.

విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రత్యేక పుస్తకాలను రూపొందించేందుకు ఆయనతో కలిసి పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, విద్యార్థులలో మంచి ఆలోచనలను వ్యాప్తి చేయడంలో చాగంటి పాత్ర కీలకమవుతుందని భావిస్తున్నారు. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థులకు అనుసరణీయమైన పాఠాలను అందించడమే లక్ష్యమని చాగంటి పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను తాను గౌరవంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. తన మాటల ద్వారా విద్యార్థుల మనసులను ప్రభావితం చేయడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పదవుల కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని, పిల్లల శ్రేయస్సు కోసమే ఈ బాధ్యతను ఒప్పుకున్నానని చెప్పారు. చాగంటి వ్యాఖ్యానాలు విద్యార్థుల మనోభావాలను పెంపొందించడంలో ఎంతగానో సహాయపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. నైతిక విలువలపై రచించిన పుస్తకాల ద్వారా విద్యార్థులు జీవితంలో మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి తోడ్పడతాయని భావిస్తున్నారు. ఈ చర్యల ద్వారా విద్యావ్యవస్థలో కొత్త ఒరవడిని తీసుకురావచ్చే అవకాశం ఉంది.