ఓజి.. ఓజి అంటూ అరిస్తే సరిపోదు: పవన్

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించారు. గిరిజనులకు పక్కా రోడ్ల నిర్మిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈరోజు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓజి.. ఓజి అంటూ కేకలు వేస్తున్న తన అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓజి.. ఓజి అంటూ అరుపులు కేకలు పెడుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదివరకు సీఎం సీఎం అనే వారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాను కాబట్టి ఆనందించాలని అభిమానులతో పవన్ అన్నారు. ఇంకాపండేహే అంటూ పవన్ తన ఫ్యాన్స్ తో సరదాగా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ఓజి, ఓజి అంటూ కేకలు పెట్టడం, తనతోపాటు వేరే సినిమా హీరోల పోస్టర్లు పెట్టడం ఓకే అని..కానీ దానితో పాటు భవిష్యత్తు గురించి కూడా యువత ఆలోచించాలని అన్నారు. ఇలా కేరింతలు జేజేలు కొడితే సరిపోదని, జీవితాల పట్ల బాధ్యతగా ఉండి ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు..ఛాతీ మీద కొడితే రోడ్లు రావు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తనకు పనిచేయడం ఒక్కటే చేతనవుతుందని,ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి ప్రజలకు కావాల్సిన పనులు మాత్రమే చేయగలనని అన్నారు.

అయితే, తన పని తనను చేసుకోనివ్వాలని, తన మీద పడిపోయి జనం ఇబ్బంది పెడుతుంటే తాను రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించలేనని అన్నారు. మీకు దండం పెడతాను నన్ను పని చేసుకునీయండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.