ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై అలాగే ప్రజాప్రతినిధుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివక్ష చూపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, వివక్షతో వ్యవహరించడం సరికాదని స్పష్టంగా చెప్పారు.

శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కల్పించిన సౌకర్యాలను ఇప్పుడు టీటీడీ ఉపేక్షించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సమన్వయంతో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అధిక లబ్ధి పొందారని, ఈ విషయం నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే, రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలంగాణలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. టీటీడీ ఛైర్మన్‌కు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వివక్ష సమస్యను పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీటీడీపై తీవ్రమైన విమర్శలు రావడం, తెలంగాణ ప్రజాప్రతినిధులకు పూర్తి గుర్తింపునివ్వడం అవసరమని పలువురు తెలంగాణ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాల్సి ఉంది.