విజ‌య్ మాల్యా ఆస్తులు అమ్మేశాం: కేంద్రం

ఆర్థిక నేర‌స్తుడు.. ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో త‌ల‌దాచుకున్న ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌.. కింగ్ ఫిష‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు.. విజ‌య్ మాల్యా ఆస్తులు అమ్మేసిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బుధ‌వారం లోక్‌స‌భ‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. విజ‌య్ మాల్యా.. ఆర్థిక నేరాల‌పై పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. వివిధ బ్యాంకుల‌కు ఆయ‌న ఎగ‌వేసిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ మాల్యా ఆస్తుల‌ను అమ్మేసి.. కొంత మేర‌కు ఆయా బ్యాంకుల‌కు అప్పులు తీర్చినట్టు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది 14 వేల కోట్ల రూపాయ‌ల‌ను విజ‌య్ మాల్యా అప్పుల కింద బ్యాంకుల‌కు జ‌మ చేసిన‌ట్టు వివ‌రించారు. అదేవిధంగా మ‌రో ఆర్థిక మోస‌గాడు, వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ ఆస్తుల‌ను కూడా అమ్మేసిన‌ట్టు తెలిపారు. ఆయ‌న నుంచి కూడా 1000 కోట్ల రూపాల‌ను రాబ‌ట్టి.. బ్యాంకుల‌కు జ‌మ చేశామ‌న్నారు.

ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన ఎగ‌వేత దారుల(చౌక్సీత‌దిత‌రులు) కు చెందిన ఆస్తుల‌ను కూడా అమ్మేసిన‌ట్టు మంత్రి చెప్పారు. ఆ సొమ్మును మొత్తంగా 22 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల‌కు జ‌మ చేశామ‌న్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని, ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను కోర్టుల అనుమ‌తితో విక్రయించిన‌ట్టు మంత్రి వివ‌రించారు. అయితే.. స‌భ‌లో స‌భ్యులు ప్ర‌శ్నించే వ‌ర‌కు కేంద్రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.