రోడ్డెక్కిన తెలంగాణ ప్ర‌భుత్వం

తెలంగాణ‌లో చిత్ర‌మైన రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయ‌కులు మంత్రులు రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. అంతేకాదు.. పాద‌యాత్ర కూడా చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. భారీ బ్యాన‌ర్ల‌తో నాయ‌కులు, మంత్రులు ముందుకు క‌ద‌లిలారు. ఈ పాద‌యాత్ర‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇత‌ర మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు.

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీని వెనుకేసుకు వ‌స్తోంద‌ని.. ఆయ‌న‌పై అమెరికాలో కేసులు న‌మోదైనా.. క‌నీసం విచార‌ణ‌కు కూడా అనుమ‌తించ‌డంలేద‌ని నాయ‌కులు ఆరోపించారు. ‘చ‌లో రాజ్‌భ‌వ‌న్‌’ పేరుతో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మీడియా సంస్థ‌ల‌తో మాట్లాడుతూ.. అదానీకి దేశ సంప‌ద‌న దోచిపెడుతున్నార‌ని మోడీపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా మ‌ణిపూర్‌లో అల్ల‌ర్లు జ‌రుగుతున్నా.. కేంద్రం క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌డం లేద‌న్నారు.

కానీ, జ‌మిలి ఎన్నిక‌ల కోసం కేంద్రం ఆరాట ప‌డుతోంద‌ని.. రాష్ట్రాల హ‌క్కుల‌ను కాల‌రాసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాలు సైతం.. సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు బుద్ధి తేవాల‌న్న ఉద్దేశంతోనే తాము చ‌లోరాజ్‌భ‌వ‌న్‌ నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వంద‌ల సంఖ్య‌లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.